దక్షిణ తెలంగాణ సాగునీటి చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కరువు, ఫ్లోరైడ్, వలసలతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నల్లగొండ జిల్లాను శాశ్వతంగా ఆ సమస్యల నుంచి విముక్తి చేసి, సాగునీరు – సురక్షిత తాగునీరు – వ్యవసాయాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
నల్లగొండలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేసి చూపించే ప్రభుత్వమని పేర్కొన్న ఆయన, వేల కోట్ల రూపాయల విలువైన సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.”ఇకపై నల్లగొండ అంటే కరువు, ఫ్లోరైడ్ కాదు… పచ్చని పంటలు, సురక్షిత తాగునీరు, సుభిక్షమైన రైతాంగం గుర్తుకు రావాలి” అని మంత్రి అన్నారు.
ఏలిమినేటి మాధవరెడ్డి–శ్రీశైలం ఎడమ కాలువ (ఏఎంఆర్-ఎస్ఎల్బీసీ) తెలంగాణలో అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు.30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించి దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించనున్న ఈ ప్రాజెక్టుకు గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్ఐ) ద్వారా ఆధునిక హెలికాప్టర్ ఆధారిత ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే నిర్వహించి, దేశంలోని ప్రముఖ నిపుణులను భాగస్వామ్యం చేసి పనులను పునఃప్రారంభించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిండి ఎత్తిపోతల పథకానికి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి పెండింగ్ సమస్యలను పరిష్కరించి అన్ని అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ జిల్లాలోని 14 మండలాలు, మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో కలిపి 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షిత తాగునీరు లభిస్తుందని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియలను నిర్వాసితుల ప్రయోజనాలకు భంగం కలగకుండా పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన అనంతరం చారిత్రాత్మక నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమగ్ర ఆధునీకరణను చేపడతామని మంత్రి ప్రకటించారు.స్వతంత్ర భారతదేశంలో నిర్మితమైన అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రాజెక్టులలో నాగార్జునసాగర్ ఒకటని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ దేశానికి అందించిన గొప్ప వారసత్వానికి ప్రతీకగా దీన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ మొత్తాన్ని ఆధునీకరించి, నీటి నష్టాలను తగ్గించి, 6.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరింత సమర్థవంతంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి విప్లవాత్మక చర్యల ఫలితంగానే తెలంగాణ దేశంలోనే అగ్రగామి ధాన్య ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సాగునీటి విస్తరణతో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగిందని, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసి, సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల రైతుల్లో కొత్త నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు.
ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేసిందని, 2025-26 ఖరీఫ్, యాసంగి సీజన్లు కలిపి మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ చరిత్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ అత్యధిక రికార్డు నమోదు చేసిందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ రికార్డు నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు.





