ప్రజా పోరాటాలతోనే అధికారం సాధ్యం :బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

Must read

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయాలను నితిన్‌ నబీన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ప్రజాసేవ, పోరాటాల ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి రాగలం. పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. పశ్చిమ బెంగాల్‌లో కార్యకర్తల కృషితోనే బీజేపీ ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పోరాడాలి. త్వరలో ఈ రాష్ట్రంలోనూ కాషాయ జెండా ఎగరాలి. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. లోక్‌సభలో రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ . ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోంది. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మాస్వరాజ్‌ ఎంతో పోరాడారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వల్లే తెలంగాణ కల సాకారమైందని నితిన్‌ నబీన్‌ అన్నారు.

హైదరాబాద్ బీజేపీ అడ్డా : పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

హైదరాబాద్ బీజేపీ అడ్డా అని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా తమ పార్టీని అడ్డుకోలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతోపాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలోని బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావడం పార్టీ బలాన్ని చాటుతోందన్నారు.

కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ విజయం సాధించడం ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలను సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మార్చేశారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయేదని.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో చిన్న వర్షానికే నగరం జలమయమవుతున్నదని విమర్శించారు. రోడ్లపై వరదనీరు నిలవడం, వాహనాలు చిక్కుకుపోవడం, విద్యుత్ షాక్‌లతో ప్రాణనష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. నగర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆరోపించారు.

ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాంచందర్‌ రావు విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ వల్లే బీజేపీ గెలిచిందని చెబుతున్నారని.. అయితే.. కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ప్రజా మద్దతు ఉన్న పార్టీనే గెలుస్తుందని, తెలంగాణలో కూడా ప్రజల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో చేతులు కలిపి అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం రోహింగ్యాలు, అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుల ఓట్లతో హైదరాబాద్‌లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని పేర్కొన్నారు. అలాంటి అక్రమ ఓట్ల నమోదు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను, విధానాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!