పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లే మా లక్ష్యం :సీఎం రేవంత్​ రెడ్డి

Must read


  • తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు వేలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, ఆ ఉద్యమ ఫలితాన్ని మాత్రం కేసీఆర్‌ కుటుంబం అనుభవించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్న ఆ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని, వారికి మళ్లీ అధికారం కట్టబెట్టే పరిస్థితి లేదన్నారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నాగార్జున కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

గ్రామాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతుంటే బీఆర్‌ఎస్‌ నాయకులకు కడుపుమంటగా ఉందన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారే తప్ప పేదల ఇళ్ల గురించి ఆలోచించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో ఏటా రూ.16 వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, గత 30 నెలల్లో రైతుల ఖాతాల్లో రూ.1.56 లక్షల కోట్లను జమ చేశామని తెలిపారు. యూరియా సరఫరాలో కేంద్రం సహకరించకపోయినా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

కేవలం 30 నెలల్లోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్ర సృష్టించామని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన ప్రభావంతోనే కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేశారని, మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవిని వదులుకుని ఉద్యమంలో పాల్గొన్నారని కొనియాడారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను బీఆర్‌ఎస్‌ నాయకులు తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. పెట్రోల్‌ పోసుకుని ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వంటి అమరవీరులను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదన్నారు.

మూసీ నది కాలుష్యం నల్గొండ ప్రజలకు శాపంగా మారిందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. దీనిని కూడా కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళనను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేసి ప్రజల ఫోన్ సంభాషణలను కూడా విన్నారని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుకు నిజాలు మాట్లాడే అలవాటు లేదని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించిన సీఎం, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!