భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులు కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో కుటుంబంలో మిగిలిన ఒక్క కుమార్తె తన అన్నకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక సంఘటన బూర్గంపహాడ్ మండలంలో సోమవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కరకగూడెం మండలానికి చెందిన ఆడెపు సతీశ్, స్వప్న దంపతులకు మనోహర్ అనే కుమారుడు, మాధురి అనే కుమార్తె ఉన్నారు. కుటుంబం సాధారణ జీవితం గడుపుతూ ఉండగా.. ఒక్కసారిగా జరిగిన ప్రమాదం వారి జీవితాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.
గతంలో జరిగిన ప్రమాదంలో సతీశ్ తలకు గాయమవడంతో వైద్య పరీక్షల కోసం కుటుంబ సభ్యులు భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సతీశ్, ఆయన భార్య స్వప్న, కుమారుడు మనోహర్ కలిసి ఆటోలో బయల్దేరారు. అయితే బూర్గంపహాడ్ మండలం కోయగూడెం సమీపానికి చేరుకున్న సమయంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో మనోహర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. తల్లిదండ్రులు సతీశ్, స్వప్నలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో ఇద్దరూ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.
ఒక్కసారిగా కుటుంబంపై పడిన ఈ విషాదం స్థానికులను కలచివేసింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండటంతో.. కుమార్తె మాధురి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. అయినప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తన అన్నకు అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటనను చూసిన గ్రామస్థులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు.
సాధారణంగా కుటుంబ పెద్దలు లేదా తల్లిదండ్రులు పిల్లలకు అంత్యక్రియలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ పరిస్థితులు తారుమారవడంతో చెల్లెలే తన అన్నకు చివరి వీడ్కోలు పలకాల్సి రావడం అందరినీ కంటతడి పెట్టించింది. మాధురి ఆవేదన చూసి అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం తర్వాత కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆసుపత్రిలో కోమాలో ఉన్న తల్లిదండ్రుల చికిత్సకు భారీ ఖర్చులు అవసరమవుతున్నాయని సమాచారం. స్థానికులు, బంధువులు కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. కొందరు సామాజిక సేవా సంస్థలు కూడా సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తున్నాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి భద్రత, వాహనాల పరిస్థితి, డ్రైవింగ్‌లో జాగ్రత్తలపై అవగాహన అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.





