కేంద్ర మంత్రులను కలిసిన తుమ్మల, ఉత్తమ్

Must read

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెంపుపై విస్తృతంగా చర్చించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (NMEO-OP) లక్ష్యాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించగా, 70 వేల మందికిపైగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఈ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

భారత్ ప్రస్తుతం వంటనూనెల అవసరాల్లో దాదాపు 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోందని, ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన NMEO-OP కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతాంగానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయితే ఇటీవల క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడం వల్ల దేశీయ ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు తెలంగాణలో ఎరువుల సరఫరా, పోషకాధారిత ఎరువుల సబ్సిడీ (NBS) విధానంలో మార్పులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పలు లేఖలు రాయగా… ఈ వినతులపై స్పందించిన కేంద్ర మంత్రి తెలంగాణలో యూరియా, డి.ఎ.పి. తదితర ఎరువుల లభ్యత, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులను ఆదేశించినట్లు తన లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించడం రైతాంగానికి ప్రయోజనకరంగా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశాలలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ ల వెంట ఎంపిలు రఘువీర, కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!