ప్రకృతి వ్యవసాయంతో పశుగ్రాస భద్రతకు శ్రీకారం :మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

Must read

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో పశుసంపద రక్షణ, పశుపోషకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తోంది.

ఇందులో భాగంగా “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ విధానంపై రూపొందించిన అవగాహన కరపత్రాలను రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంతో పాటు పశుసంపదపై కూడా పడుతున్న నేపథ్యంలో రైతులు, పశుపోషకులు పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రకృతి వ్యవసాయ సాంకేతికతలను అనుసరించడం ద్వారా మెరుగైన పశుగ్రాస దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

పచ్చిమేత లభ్యత, పశుగ్రాస నిల్వ, తాగునీటి వసతులు, పశుసంరక్షణ చర్యలపై సమగ్ర సమాచారం అందించేందుకు ఈ కరపత్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా రైతులు, పశుపోషకులకు ఈ కరపత్రాలను పంపిణీ చేసి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

పశుసంపద పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా పశుపోషకులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం ద్వారా పశుసంపదను సంరక్షించుకోవచ్చన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో పశుసంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారమని పేర్కొన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ, పశుపోషణ రంగాలు లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని చెప్పారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా రైతులు, పశుపోషకులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ విధానం ద్వారా వర్షాకాలం ప్రారంభానికి ముందే పశుగ్రాసాల విత్తనాలను భూమిలో చల్లడం జరుగుతుంది. తొలి వర్షాలు పడగానే అవి వేగంగా మొలకెత్తి పెరుగుతాయి. ఈ విధానం ద్వారా తక్కువ వర్షపాతం ఉన్నా కూడా పశుగ్రాసాల ఉత్పత్తిని కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రైతులు ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా పశువులకు అవసరమైన మేతను సమృద్ధిగా అందించడంతో పాటు అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులు, పశుపోషకులకు అవగాహన కల్పించేందుకు ఈ కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీత‌ల సుజాత‌, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు, శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!