భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో పనిచేస్తున్న ఒక వింగ్ కమాండర్ హనీట్రాప్‌కు గురై, కీలకమైన రక్షణ సంబంధిత రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఐఏఎఫ్ అధికారి ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఏఎఫ్ నిఘా విభాగం నుంచి అందిన సమాచారంతో పోలీసులు మే నెలాఖరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
అధికారిపై అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. అరెస్టు అనంతరం కోర్టులో హాజరుపరిచిన అధికారులు, ప్రస్తుతం సదరు వింగ్ కమాండర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాచారం అందించారు? ఎవరికి పంపారు? ఎంతకాలంగా ఈ పరిచయం కొనసాగుతోంది? అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
పోలీసు వర్గాల ప్రకారం.. సదరు ఐఏఎఫ్ అధికారిని సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి సంప్రదించినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. తొలుత సాధారణ ఆన్లైన్ పరిచయంగా ప్రారంభమైన ఈ వ్యవహారం క్రమంగా సున్నితమైన సమాచారాన్ని పంచుకునే స్థాయికి చేరినట్లు అనుమానిస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాన్ని ఉపయోగించుకుని అధికారిని ఒక గూఢచర్య వలలోకి లాగినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో ఏర్పడిన ఆన్లైన్ సంబంధాన్ని క్రమంగా ఉపయోగించుకుని సున్నితమైన సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో హనీట్రాప్ కోణం అత్యంత కీలకంగా మారింది. వ్యక్తిగత పరిచయం, భావోద్వేగ సంబంధాలు లేదా నమ్మకాన్ని ఉపయోగించుకుని రక్షణ రంగానికి చెందిన అధికారుల నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడం హనీట్రాప్ గూఢచర్యంలో సాధారణంగా కనిపించే విధానంగా దర్యాప్తు సంస్థలు పరిగణిస్తాయి.ఈ కేసులోనూ సోషల్ మీడియా పరిచయం ద్వారా సదరు అధికారిని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
సోషల్ మీడియా పరిచయం అనంతరం వింగ్ కమాండర్ వర్గీకృత సమాచారాన్ని, కీలకమైన పత్రాలను పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన అంశాలతో ముడిపడి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.అయితే ఏ రకమైన పత్రాలు లీక్ అయ్యాయి? వాటిలో ఎంత సమాచారం ఉంది? అవి నిజంగా వర్గీకృత పత్రాలేనా? వాటి వల్ల దేశ భద్రతకు ఏమైనా నష్టం జరిగిందా? అనే అంశాలపై అధికారులు ప్రస్తుతం ఆధారాలు సేకరిస్తున్నారు.కేసు దర్యాప్తులో భాగంగా అధికారికి సంబంధించిన డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా కార్యకలాపాలు, సందేశాలు, ఫైల్ బదిలీలు వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం వెనుక పాకిస్థాన్‌కు చెందిన హ్యాండర్ల పాత్ర ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. భారత సైనిక, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు విదేశీ గూఢచర్య సంస్థలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాయా? అనే కోణంలోనూ విచారణ సాగుతున్నట్లు సమాచారం.అయితే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం ఈ దశలో అధికారికంగా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ అనుమానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ కేసులో ఐఏఎఫ్ నిఘా విభాగం అందించిన సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన అనంతరం సంబంధిత సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించి, ఆధారాలను సేకరించిన అనంతరం మే నెలాఖరులో వింగ్ కమాండర్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. సైనిక నిఘా వ్యవస్థ, పౌర పోలీసు విభాగం సమన్వయంతో కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అనధికారికంగా సేకరించడం లేదా ఇతరులకు అందించడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో సదరు అధికారిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.కేసులో లభించే ఆధారాల ఆధారంగా మరిన్ని సెక్షన్లు వర్తింపజేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
గూఢచర్యానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు వేదికలుగా మారుతున్న నేపథ్యంలో ఈ కేసులో డిజిటల్ ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉంది. అధికారికి వచ్చిన సందేశాలు, పరిచయమైన వ్యక్తుల వివరాలు, పంపిన ఫైళ్లు, పత్రాల మూలం వంటి అంశాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ధికారితో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, ఆన్లైన్ ఖాతాలు, కమ్యూనికేషన్ మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సున్నితమైన రక్షణ సమాచారం బయటకు వెళ్లిందా? వెళ్లి ఉంటే దాని పరిధి ఎంత? అనే అంశాలను నిర్ధారించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న సిబ్బంది సోషల్ మీడియా వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. సున్నితమైన బాధ్యతల్లో ఉన్న అధికారులు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు పెంచుకోవడం వల్ల ఎదురయ్యే భద్రతా ప్రమాదాలను ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని వ్యక్తిగత పరికరాలు, సోషల్ మీడియా లేదా అనధికారిక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా పంచుకోకుండా భద్రతా నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





