బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటిడిఎ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావు లు, సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన, పోలవరం నియోజకవర్గం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శాఖలు, మండలాలు వారీగా రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పూర్తి అయినవి, పెండింగ్లో ఉన్న పనులు, చేయవలసిన పనులను సుథీర్ఘంగా మంత్రి సమీక్షించారు. అనంతరం ప్రజలు నుండి అర్జీలను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దేశ సంపదను కాపాడే గిరిజనులు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, గిరిజన ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకు వచ్చేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఒక కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉపాధి కల్పించేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి, పక్కాగా అమలు చెయ్యాలని అన్నారు. రాష్ట్రంలో ఒకేరోజు 13 వేలు గ్రామ సభలు నిర్వహించి, పూజ్యభాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కొరకు ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.
రాష్ట్రంలో 7 వేలు కిలోమీటర్లు సీసీ రోడ్డులు వేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆర్&ఆర్ కు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వాటిని విచారణ చేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గిరిజన ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఉపాధిహామీ కింద రూ 30 కోట్లతో రహదారులను అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, నిర్ణీత సమయంలోగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. గిరిజన సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అధికార్లు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. గత ఐదుఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ఏళ్లలో జరిగిన కార్యక్రమాలు పూర్తి వివరాలు అందరికీ తెలిసేలా స్వర్ణగ్రామ సచివాలల్లో డిస్ ప్లే చెయ్యాలని ఆదేశించారు. గిరిజనులకు రాజ్యాంగ పరమైన హక్కులు, సంక్షేమ పధకాలు ప్రయోజనాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గిరిజన సమస్యలు పరిష్కారంకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో గిరిజన సమస్యలు పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.
గిరిజన ప్రాంతంలో విద్యార్హతలు తక్కువగా ఉన్న యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి వారికి ఉపాధి కల్పించేందుకు పక్కా ప్రణాళికలతో అమలు చేసి లక్ష్యాలను అధికమించాలని అన్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, తదితర జీవాలు పెంపకానికి రుణాలు కోరిన గిరిజనులకు ఈ ఆర్ధిక సంవత్సరంలో నూటికి నూరుశాతం రుణాలను మంజూరు చేయించాలని మంత్రి స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలకు వివిధ వ్యాపారాలకు ఉదారంగా బ్యాంకు రుణాలు మంజూరు చేసేలా అధికారులు కృషిచెయ్యాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని సూచించారు. ప్రజలు నుంచి అందుతున్న వినతులు, సమస్యలను సత్వరమే పరిష్కరించి, పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, గ్రామీణ మౌళిక వసతులు, తాగునీటి సరఫరా, రహదారులు, వ్యవసాయం, గిరిజన సంక్షేమం తదితర అంశాలుపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
సమావేశంలో జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఆర్డీవో యం.వి. రమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఐ.కిషోరు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, ఏయంసి ఛైర్మన్ పొట్టా రామారావు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జయవరపు శ్రీరామూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ డిడి జి.సత్యనారాయణ, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, జిల్లా పరిశ్రమలు కేంద్రం జియం ఆర్.వెంకటరావు, జిల్లా, డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు, తహశీదార్లు, యంపిడివో లు, ఐటిడిఏ ఇంజనీరింగు అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘాలు నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.





