తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎంలను ప్రశ్నించకుండా, కేవలం జనసేనను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తుండటంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాను ప్రెస్‌మీట్ పెడితే శాంతిభద్రతల సమస్య అవుతుందా అని ప్రశ్నించారు. చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు లేవని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై విమర్శల వెనుక రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఉన్నారని అనుకోవడం లేదన్నారు. పెచ్చుమీరుతున్న ప్రాంతీయవాదంపై కేంద్రం దృష్టిపెట్టాలని పవన్ సూచించారు.
తెలంగాణకు వలసలు తగ్గాలంటే ఏపీ యువతకు ఉద్యోగాలు రావాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. . హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సాయంత్రం నాలుగన్నర నుంచి ఐదున్నర గంటల వరకు ప్రెస్ మీట్ జరిగింది. నవనిర్మాణం పేరుతో తెలంగాణ జనసేన నాయకులతో ఇవాళ పవన్ సమావేశం తలపెట్టారు. అయితే ఈ సమావేశానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కనీసం ప్రెస్ మీట్ కు అయినా హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నట్లు ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. ఈ మేరకు సాయంత్రం 4.30కు తన నివాసం ముందు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.
ప్రాంతీయ వాదమే.. కాంగ్రెస్ వాదమా?: ప్రాంతీయ వాదమే.. కాంగ్రెస్ వాదమా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి అంటూ లేదన్నారు. జాతీయ పార్టీ ప్రాంతీయ వాదం గురించి మాట్లాడటం సరికాదన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకుని వెళ్లాలా అని పవన్ ప్రశ్నించారు. మీరు భయపెట్టే కొద్దీ.. మా గుండె మరింత గట్టిపడుతుందని పవన్ స్పష్టం చేశారు.
తెలంగాణలో జనసేన ఉంటుంది, తమ పార్టీ నేతలు పోటీచేసి తీరుతామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ.. భారతదేశంలో అంతర్భాగమని, తాను ఇక్కడ పర్యటిస్తానన్నారు. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పలుకుతామని, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు పదవుల్లో కూర్చున్నారని, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌కల్యాణ్ ఆరోపించారు. ఇది భారతదేశం అనుకున్నారా?.. పాకిస్థాన్, పాలస్తీనా అనుకున్నారా? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చని, ఇందిరాగాంధీ మెదక్‌లో, పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీ చేయవచ్చు, కానీ ఇక్కడ తనకు తిరిగే హక్కు లేదంటారా అని మండిపడ్డారు.
మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్లం కాదు: తనను భయపెట్టాలని చూస్తే భయపడే వాడిని కాదన్నారు పవన్ కల్యాణ్. తెలంగాణలో ఎలా తిరుగుతావని కొందరు కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని అలాంటి వారిని పట్టించుకోనన్నారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు ఊడిగం చేశారని, తెలంగాణకు వ్యతిరేకమని వైఎస్ బహిరంగంగా చెప్పినా ఆయనకే ఊడిగం చేశారని పవన్ ఆరోపించారు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు మీ గొంతులంతా ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి.. ఏపీకి వచ్చినప్పుడు స్వాగతించానని, జనసేన మాజీ నాయకులను బీఆర్ఎస్లోకి తీసుకున్నా స్వాగతించానని పవన్ గుర్తు చేసుకున్నారు.





