ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే కీలక పరిణామం చోటుచేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో ప్రధానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధానిని కలిసిన లోకేశ్, ఆయనకు శాలువా కప్పి ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల గాథను ప్రధానికి వివరించినట్లు చెప్పారు. రైతుల త్యాగం వల్లే అమరావతి రూపుదిద్దుకుంటోందని, వారి ఆశయాలను గౌరవిస్తూ ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు మార్గనిర్దేశం చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.
ఈ భేటీ అనంతరం లోకేశ్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ, అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న మద్దతు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రైతుల త్యాగాలను మరువబోమని, వారి కలలను సాకారం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.అనంతరం లోకేశ్, ఇతర ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి బిల్లు ఆమోదానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026 ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లులో 2014 పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను సవరిస్తూ, ‘కొత్త రాజధాని’ అనే పదం స్థానంలో ‘అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో అమరావతికి చట్టబద్ధత మరింత బలపడింది.ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ముందుకు రానుండగా, అక్కడ కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకే లోకేశ్ ఢిల్లీ పర్యటన చేపట్టారు.
అదేవిధంగా తన పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ను కూడా లోకేశ్ కలవనున్నారు.





