దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి తన భక్తిని చాటుకుంటూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఇంటి పూజా మందిరంలో ప్రతి సంవత్సరం చోటుచేసుకునే ఒక అద్భుత దృశ్యాన్ని అభిమానులతో షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.చిరంజీవి వివరించిన ప్రకారం, ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు సూర్యకిరణాలు ఇంద్రధనస్సు రంగుల్లా మారి, తమ పూజా గదిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహంపై పైనుంచి కింద వరకు పడతాయి. ఈ దృశ్యం ఆధ్యాత్మికంగా ఎంతో మంత్రముగ్ధులను చేస్తుందని ఆయన తెలిపారు. ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిదని, స్వామివారి కృపగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ సందర్భాన్ని వివరిస్తూ, ఇటీవల అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహంపై పడిన ‘సూర్య తిలకం’ను గుర్తు చేశారు. అలాగే కొణార్క్ సూర్య దేవాలయం, అరసవిల్లి సూర్య దేవాలయం వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలాంటి దైవిక కిరణాలు దర్శనమిస్తాయని చెప్పారు. అలాంటి అనుభూతిని తన ఇంట్లోనే పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.చిరంజీవికి చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామిపై ఉన్న భక్తి అందరికీ తెలిసిందే. తన జీవితంలో సాధించిన ప్రతి విజయానికీ స్వామివారి ఆశీస్సులే కారణమని ఆయన బలంగా విశ్వసిస్తారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, చదువుకునే రోజుల్లో ప్రతిరోజూ హనుమంతుడి ఆలయానికి వెళ్లేవాడినని చెప్పారు.
జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా స్వామిని తలచుకుంటే చాలు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. భక్తి, నమ్మకం మనిషికి ఎంతటి ధైర్యాన్ని ఇస్తాయో తన జీవితం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు ఆయన భక్తిని ప్రశంసిస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.





