పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..

Must read

పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ, అవి ‘దురుద్దేశపూర్వకమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించేవి’ అని పేర్కొంది. ధరల పెంపుపై ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఇంధన ధరల పెంపుపై వస్తున్న వార్తలకు ఎలాంటి ఆధారం లేదని తెలిపింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ విమర్శించింది.

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని ఏకైక దేశంగా భారత్ నిలిచిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినా, ఆ ప్రభావం సామాన్యులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా ధరల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించింది.

ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచగలిగామని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తున్నామని తెలిపింది.

ఇదే సమయంలో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని, సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. వంటగ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు కూడా వాస్తవం కాదని పేర్కొన్నారు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు నిలిచిపోవడంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103 డాలర్లు దాటగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 94 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. అయినప్పటికీ దేశీయంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని కేంద్రం తెలిపింది.

ఇంధన ధరలపై వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వర్గాల సమాచారం ఆధారంగానే విశ్వసించాలని సూచించింది. మీడియా కథనాల పేరుతో వస్తున్న ఆధారరహిత సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!