అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై వైసీపీ అనవసరంగా దుష్ప్రచారం చేయడం తగదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ సానా సతీష్, కలెక్టర్ హరేంథిర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సూచించారని తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తానే స్వయంగా వెళ్లి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే, తన శాఖకు సంబంధించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమం ఉన్నందున వైజాగ్ వెళ్లాల్సి ఉందని, అదే సమయంలో కేంద్ర మంత్రి కూడా కార్యక్రమానికి వస్తుండటంతో తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారని మంత్రి వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నందుకు తన శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారని, వెంటనే తన సిబ్బందికి సమాచారం అందించి అధికారికంగా మీడియాకు కూడా వివరాలు వెల్లడించారని మంత్రి నారాయణ తెలిపారు. అయినప్పటికీ కొన్ని పత్రికలు, వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు.
అమరావతికి వెళ్లే ప్రజలు కరకట్ట రోడ్డుపై ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అమరావతి అభివృద్ధిని అభినందిస్తున్నారని చెప్పారు. గతంలో కూడా స్టీల్ బ్రిడ్జి పడిపోతుందని అసత్య ప్రచారం చేస్తూ రచ్చ చేయాలని కొందరు ప్రయత్నించారని మంత్రి విమర్శించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరుగుతుందేమోనని ఎదురుచూస్తూ అక్కడికి వెళ్లి గొడవ చేయాలని కొందరు కాచుకుని కూర్చున్నారని అన్నారు. జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలు మరోసారి తగిన సమాధానం చెబుతారని, గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు కూడా ఇక రావని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి హాజరుకాని వారికి ఎమ్మెల్యే క్వార్టర్ల గురించి మాట్లాడే అధికారం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం సాధించాలంటే అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీకి వెళ్లని వారికి తాము ఎందుకు ఓట్లు వేశామా అని ప్రజలు ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లను దశలవారీగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఒక్కో నెల ఒక్కో అధికారుల నివాస సముదాయాన్ని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను స్పీకర్, కౌన్సిల్ చైర్మన్‌లకు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం లాటరీ విధానంలో క్వార్టర్లను కేటాయించే ప్రక్రియ చేపడతారని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో భూముల విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని కోర్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొంది 16 వేల కుటుంబాలు సంతోషంగా ఉంటే వైసీపీ నేతలు భరించలేక రచ్చ చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.జిల్లాలో రైతుల పంటల బీమా గడువును పొడిగించేందుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
జిల్లాలో అన్న క్యాంటీన్ల సంఖ్యను పెంచాలని డీఆర్సీ సమావేశంలో ప్రతిపాదన వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పిఠాపురం ప్రాంతంలో విద్యుత్ లైన్లను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 11 వేల ఇళ్లకు కనెక్షన్లు అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం అమలును మరింత సమర్థవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. జిల్లాలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. డీఆర్సీ సమావేశంలో జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించి, ఆయా శాఖల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.





