సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే :మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు

Must read

‘గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. ఆ మేరకు టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినేట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా…కమిటీ సభ్యులు శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని ప్రత్యేకంగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేబినేట్ సబ్ కమిటీ ఛైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లు కేటాయించిందన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లో… ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా అని… నాణ్యతలో రాజీ పడొద్దని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. వర్క్ ప్రోగ్రెస్ ను రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తేవాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమష్ఠిగా పని చేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలు విజయవంతం అవుతాయన్నారు.

శాఖల మధ్య సమన్వయం లోపం తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోడ్డును అనుసంధానించాలన్నారు. ఎక్కడైనా రోడ్ల కనెక్టివిటీ మిస్ అయితే వెంటనే గుర్తించి, లోకల్ ఫండ్స్ నుంచి పనులు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను పుష్కర ఏర్పాట్లలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు.

భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కేబినేట్ సబ్ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని… అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పుష్కర ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!