నీటి రూపాలు

Must read

కన్నీరు కరిగిన గుండెకు
కలిగే మూగసాక్ష్యం;
కంటి తలుపులు తెరిస్తే
కథలై జారే భావప్రవాహం॥

మున్నీరు మహాసముద్రమై
మహిమను చాటే జలవైభవం;
లోతెరిగినవారికే
లోకసత్యాలు తెలిపే గురుబోధనం॥

తన్నీరు దాహార్తిని తీర్చే
దైవానుగ్రహపు తీర్థం;
ప్రాణమనే మొక్కకు
ప్రతిరోజూ పోసే జీవజలం॥

తేనీరు అలసటను కరిగించే
ఆప్యాయతల ఆహ్వానం;
ఒక కప్పులోనే
వంద పలకరింపులు నింపే స్నేహం॥

చన్నీరు చికాకులను చల్లార్చే
చిరునవ్వుల నేస్తం;
వేసవి వేడిలో
వెన్నెలై దిగివచ్చే వరం॥

వెన్నీరు వెచ్చని వాత్సల్యంతో
వేదనను వీడదీసే వైద్యం;
శరీరానికే కాదు,
మనసుకూ హాయినిచ్చే మమతామృతం॥

ఎలనీరు ఎండల దాహానికి
ఎదురొడ్డి నిలిచే ప్రకృతి ప్రసాదం;
కొబ్బరి గుండెలో దాగిన
కల్పవృక్షపు కల్యాణామృతం॥

పన్నీరు పూల పరిమళాలను
పుటపుటలుగా వెదజల్లే పవిత్రజలం;
పండుగలకు
పవిత్రతను పంచే పూల జలం॥

కన్నీరు కరుణను నేర్పింది,
మున్నీరు మహిమను చాటింది,
తన్నీరు ప్రాణాన్ని నిలిపింది,
తేనీరు స్నేహాన్ని పెంచింది.

చన్నీరు చల్లదనమిచ్చింది,
వెన్నీరు వెచ్చదనమిచ్చింది,
ఎలనీరు తృప్తిని నింపింది,
పన్నీరు పరిమళం పంచింది॥

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!