అర్ధనారీశ్వరులుగా
ఆది దంపతులై..
తల్లితండ్రులుగా లోకరక్షకులై…
వాత్సల్యంతో అందరినీ
అక్కున చేర్చే తత్త్వం..
మధ్యాహ్న భానుడి భగభగలు,
నీ మూడో నేత్రంలో ప్రజ్వరిల్లగా,
నువు రుద్రుడవే…
కానీ నీ మనస్సంతా కారుణ్యమే..!
అన్యాయాన్ని దునుమాడే
శిష్టరక్షకుడువి నీవే..!
స్త్రీ పురుష సమానత్వం
అర్ధనారీశ్వర తత్త్వం..
శిరసుపై గంగమ్మ కుదురుగా,
స్త్రీలపై గౌరవానికి సాక్షిగా,
చిత్రమయా నీ లీల…!!
నుదుటన విబూది రేఖలు
భక్తుల నొసటి గీతలుగా,
చెంబడు నీళ్లు ధారగా,
కాసింత భస్మం బొట్టుగా,
ఒక బిల్వ దళం శిరసున
చాలంటావు నిరాడంబరుడిగా
మూన్నాళ్ళ తనువుకు
అలంకార మెందుకనా…?
మా జీవితాలలో
వెలుగులు నింపి
తలరాతలు మార్చే భవుడవు…
భక్తితో శివ అని పిలిచినా
ఆర్తితో నీ సన్నిధి చేరినా
కరగి పోతావు నీవు..!
నిర్వికార రూపమైన నిన్ను
నిశ్చలమైన భక్తితో కొలువగా
మా జీవితాలని చక్కదిద్దే
మహాదేవుడవు నువు..!
వ్యాఘ్రచర్మం,
గళమున వాసుకి
అట్టలు కట్టిన జటలతో
నిరాడంబరమే జీవిత పరమార్ధం
అని తెలియజేసిన నీకు
ఇవే మా ప్రణామాలు సాంబశివ…
—– అప్పె షర్మిల





