‘ మాష్టారు, మాష్టారు బాగున్నారా’ అని అమలాపురం భూపయ్య అగ్రహారపు వీధిలో ఎత్తరుగుల ఇంటి వీధి వసారలో వాలు కుర్చీలో పేపర్ చదువుకుంటున్న రామారావు గారిని సుమారు ఏభై ఏళ్ళు దాటిన బట్టతలతో ,చామన ఛాయతో ఉన్న మనిషి అడిగాడు.
'ఎవరు బాబు, చూపు సరిగ్గా కనిపించడం లేదు దగ్గరకి రా'అని ఎనిమిది పదుల వయస్సులో, ముడతలు పడిన శరీరంతో వణుకుతు కళ్ళజోడు సవరించుకుని రామారావు మాష్టారు అడిగారు.
ఆ వచ్చిన మనిషి మొదట మాస్టారి పాదాలకు నమస్కరించి 'నేనండి శ్రీనుని 'మీ దగ్గర ఎనభై లో టెన్త్ చదివాను అంటే వెంటనే 'ఎవరు సుబ్బారాయుడి గుడి దగ్గర కిరాణా షాపు అప్పారావు కొడుకు శ్రీనివాసువేనా ? అని మరింత దగ్గరగా రమ్మన్నారు రామారావు గారు.
మీ జ్ఞాపకశక్తీ అమోఘం మాష్టారు ఎలా ఉండే వారు ఎలా అయిపోయారు అని చేతిని పట్టుకున్న మాష్టారుతో కాలం తన ప్రభావం చూపుతుంది. సహస్రమాస జీవిని మొన్ననే ఎనభై నాలుగు వచ్చిందిరా శ్రీను ఉంగరాల జుత్తుతో ఎలా ఉండేవాడివి బొద్దుగా బాగుండే వాడివి నాన్న పోయాడుట మొన్న మీ చిన్నాన్న వెంకన్న చెప్పాడు. కరోనా కాటువేసి అన్నాడు . ఆ మహమ్మారి ఎంతమందిని బలితీసుకుందో అని అంటున్న మాష్టారు తో 'ఏం చేస్తాం మీరు చెప్పినట్లు విధి ని ఎవరు ఆపలేరు కదా' అని నాకు ఏభై ఆరేళ్ళు దాటాయి అన్నాడు శ్రీను అనబడే శ్రీనివాసరావు
మాస్టారు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇంజనీర్లు అమెరికా లో ఉద్యోగం, పెద్దవాడు అక్కడి పిల్లనే చేసుకున్నాడు. ఇప్పుడు రెండవ వాడి పెళ్ళి. తప్పక ,మీరు అమ్మ సీతమ్మ గారు వచ్చి ఆశీర్వదించాలి అని అమ్మని పిలవండి అంటే వణుకుతున్న చేతులతో గట్టిగా శిష్యుని పట్టుకున్నప్పుడు మాష్టారు కంటి నుంచి జాలువారిన కన్నీరు శ్రీను చేతులపై పడింది.
ఏమైంది మాష్టారు అంటే ఏభై ఏళ్లు కాపురం చేసి తోడు నీడగా ఉన్న నా సీత నన్ను వదలి వాళ్ళ అమ్మ భూమాత లో కలసి పోయింది కరోనాలో నన్ను ఒంటరి చేసి చివరిచూపు కూడా దక్కనీయలేదు ఏం చేస్తాం. ఈ వయస్సులో నాకు తీరని వ్యథ అన్నారు మాష్టారు.
మాష్టారు మరి మీ అబ్బాయి అదే అమెరికా లో పెద్ద డాక్టర్ శంకరం ఎలా ఉన్నాడు అంటే బాగానే ఉన్నాడు వాడు అయినా క్షణం తీరిక లేదట అమ్మ పోయినపుడు ఫ్లైట్ రవాణా సదుపాయం లేదు కానీ కన్న తల్లి పోతే రావడానికి మూడేళ్లయిన వాడికి తీరికలేనంత బిజీ.
పోనిలెండి మాష్టారు అంటుంటే ‘అందరికి శకునం చెప్పే బల్లి కుడితి లో పడి చచ్చిందన్నట్లుంది’ శ్రీను నా పరిస్థితి. మీ నాన్న అదృష్ట వంతుడే కొడుకుగా నీ కర్తవ్యం నీవు చేశావు
ఒక్కటి చెప్పనా శ్రీను వృద్ధాప్యం మరల బాల్యమే. ఎందుకంటే ఏమి చెబుతున్నామో తెలియదు. మన అంతట మనం నడవలేము ఆసరా కావాలి.ఒకొక్కప్పుడు భోజనం చేస్తు చిన్నపిల్లలలా క్రిందపడేస్తాం.
ఆఖరికి మల, మూత్ర విసర్జన ప్రకృతి ధర్మాలు తెలియకుండా కొందరికి జరిగిపోతాయి. చిన్న పిల్లలని ముద్దాడుతు శుభ్రం చేసే జనం పెద్దవారిని చూస్తే విసుక్కుంటారు తిడతారు. వృద్ధాశ్రమాలలో పెడతారు.
ఆప్యాయంగా పలకరించరు. శరీరాన్ని ఇచ్చి నైతిక విలువలను నేర్పిన తండ్రి, రూధిరాన్ని చనుబాలు గా మార్చి ఆకలి తీర్చి కడుపునింపిన తల్లి అక్కరలేదు అంటుండగానే ఇంట్లోంచి నాతో చదువుకున్న శ్యాము అక్కడే వ్యవసాయం చేస్తున్న స్నేహితుడు వచ్చి బాగున్నావా అంటే ‘అదేమిటిఇక్కడ నువ్వు’ అంటుండగానే ఇలారా ఇప్పుడు నేను మాష్టారు కొడుకుని నా భార్య హైమ కూడ ఇక్కడే ఉంది అని లోపలకి తీసుకెళ్లాడు
.
శ్రీను సీతమ్మ గారు పోయే ముందు రోజే శంకరం అమెరికా లో కరోనాతో చనిపోయాడు ఇది అతని భార్య ద్వారా తెలిసింది. ఆమె విదేశీయురాలు .ఇప్పటి వరకు చెప్పలేదు. మంచి చెడ్డ చెప్పిన మాష్టారు దేమునితో సమానం వారి బాగోగులను మేము చూస్తున్నాము. మాష్టారు అన్నట్లు ‘వారి వయస్సు మనకొస్తుంది కానీ మన వయస్సు వారికి రాదు’ అతన్ని కంటికి రెప్పలా చూడటం లో నాకన్నా నా భార్య హైమ పాత్ర ముఖ్యమైనది అంటున్న శ్యాము నాకు దేముడిలా కనిపించి మీరు తప్పక పెళ్లికి రావాలి అని వారితో చెప్పి మాష్టారు కి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు..!!
కవి మిత్ర, సాహిత్య రత్న
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.





