పిఠాపురం ఇన్ చార్జ్ వర్మపై టీడీపీ వేటు

Must read

పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, వరుస వివాదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

ఈ మేరకు పార్టీ అంతర్గతంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, నాయకుల మధ్య సమన్వయం పెంచేందుకు కమిటీ వ్యవస్థను తీసుకురావాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ కమిటీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పిఠాపురం రాజకీయాలు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం అక్కడ టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివిధ అంశాలపై విభేదాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితిని సమీక్షించిన టీడీపీ అధిష్టానం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక తనను ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన అంశంపై ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ స్పందించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని, పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు.

‘‘రకరకాల రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మార్పులు సహజమే. చివరికి పార్టీ బాగుండాలి అన్నదే ముఖ్యం’’ అని వర్మ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ తో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

నియోజకవర్గంలో పార్టీ నిర్వహణను స్థానిక నాయకులే ముందుకు తీసుకెళ్తారని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను సహకరిస్తానని మరోసారి స్పష్టం చేశారు.

టీడీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో పార్టీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపైనే టీడీపీ దృష్టి పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రత్యేక కమిటీ ఏర్పాటుతో స్థానిక స్థాయిలో వివాదాలను తగ్గించి, పార్టీ కార్యకలాపాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే అన్ని వర్గాల నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తూ సమిష్టి నాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!