వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలి :సీఎం చంద్రబాబు

Must read

వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఓ స్పూర్తితో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అంకురార్పణ జరిగింది. బసవ తారకం కాన్సర్ ఆస్పత్రి ప్రస్థానం వెనుక కథ ఉంది.

మా అత్తగారికి సోకిన క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం ఆ సమయంలో ఎక్కడా ఆస్పత్రి లేని పరిస్థితి. ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లోనే క్యాన్సర్ ఆస్పత్రులు ఉండేవి. ఆగస్టు సంక్షోభం సమయంలోనే ఆమె క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందక ఇక ఎవరూ చనిపోకూడదనే ఆలోచనతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఎన్టీఆర్ విజన్ తో పాటు పేదలకు వైద్య చికిత్స అందించాలన్న సంకల్పంతో ఆస్పత్రి నిర్మాణం చేశాం.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీగా, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు లాంటి ప్రముఖ వైద్యులతో ఈ ఆస్పత్రి ప్రారంభమైంది. తొలుత 100 పడకల ఆస్పత్రిగా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించాం. మొక్కగా నాటిన ఈ ఆస్పత్రి ఇప్పుడు మహా వృక్షంగా ఎదిగింది. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో త్యాగాలు ఉన్నాయి. వివిధ సవాళ్లను అధిగమించి ఈ సంస్థకు బాలకృష్ణ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ అందిస్తున్న సేవలు అన్ స్టాపబుల్. ఎవర్ గ్రీన్ హీరోగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందిస్తున్నారు.

ఎంత బిజీగా ఉన్నా బసవతారకం ఆస్పత్రికి వెళ్లి రోగులను పరామర్శిస్తూ వారికి సాంత్వన కలిగిస్తున్నారు. లాభాపేక్ష లేని సంస్థగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని నడుపుతున్నారు. 650 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చెందిన ఈ ఆస్పత్రి ప్రస్తుతం ఏపీ, తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని క్యాన్సర్ బాధితులకు సేవలు అందిస్తోంది. 8 వేలకు పైగా శస్త్ర చికిత్సలు, రోజూ 22 మందికి ఆపరేషన్లు చేస్తూ బసవతారకం ఆస్పత్రి పేదవర్గాలకు అండగా నిలుస్తోంది. ఏడాదికి 3 లక్షల పైచిలుకు మంది రోగులకు ఈ ఆస్పత్రి ద్వారా చికిత్స పొందుతున్నారు. అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన బాలకృష్ణకు అభినందనలు. దేశంలోనే లాభాపేక్ష లేని అతిపెద్ద సంస్థగా బసవతారకం ఆస్పత్రి నిలవాలి.”అని సీఎం చంద్రబాబు అన్నారు.

“ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఏపీలో ప్రివెంటివ్, క్యూరెటివ్, ప్రిడిక్టివ్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు పబ్లిక్ హెల్త్ రంగంతో పాటు… లాభాపేక్ష లేని ఆస్పత్రులు కూడా వస్తే పేదలకు వైద్య సేవలు మెరుగ్గా అందుతాయి. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రుల లాంటి లాభాపేక్ష లేని ఆస్పత్రులు మరిన్ని రావాల్సి ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఆయన ఆశయ సాధన కోసం రాజకీయంగా పని చేస్తున్నాం. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి, ఆయన కుమార్డు బాలయ్య ఇద్దరూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తల్లి పేరుతో బాలయ్య బసవ తారకం ఆస్పత్రి ద్వారా సేవలు అందిస్తోంటే… ఎన్టీఆర్ కుమార్తె తండ్రి పేరుతో ఎన్టీఆర్ ట్రస్టు పెట్టి విద్యా, వైద్య సేవలు అందిస్తున్నారు. తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ విధంగా ప్రజలకు సేవలు అందించే కుటుంబం మరోకటి లేదు. పేదలకు సేవ చేసిన ఆనందం మరెందులోనూ లేదు. బాలకృష్ణ, భువనేశ్వరి అందిస్తోన్న సేవల్ని అభినందిస్తున్నాను.”అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియా పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ, తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రులు సత్యకుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, భరత్, ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!