ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో దిగువ కోర్టులు, హైకోర్టు విధించిన శిక్ష యథాతథంగా కొనసాగనుంది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సతీస్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టి కీలక తీర్పును వెలువరించింది. కేసులోని పరిస్థితులు, నేర తీవ్రత, బాధితులపై జరిగిన దారుణ దాడిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, శిక్ష తగ్గింపుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేసింది.
కోర్టు రికార్డుల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ప్రాంతానికి చెందిన ఏడిద ఆనందకుమార్కు ఇప్పటికే నేర చరిత్ర ఉంది. గతంలో తన సోదరుడితో కలిసి మరో హత్య కేసులో నిందితుడిగా తేలి జీవిత ఖైదు శిక్షను అనుభవించాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో అతని తల్లి మరణించడంతో కొన్ని నిబంధనల ప్రకారం అతను తాత్కాలికంగా విడుదలైనట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు.
అయితే జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం అతని జీవితం సాధారణంగా సాగలేదు. తన గత నేర చరిత్రను ప్రస్తావిస్తూ ఇరుగుపొరుగు వారు, స్థానికులు తనను అవమానిస్తున్నారనే భావన అతనిలో పెరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కక్షను మనసులో పెట్టుకున్న ఆనందకుమార్, ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఘోర నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
2015 డిసెంబర్ 24న జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇనుప పైపుతో దాడి చేసి వై. విజయలలితా.. గడ్డెం నాగభూషన్, కండవల్లి కుమారి అనే ముగ్గురు వ్యక్తులను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఘటన జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడిగా పేర్కొన్నారు.
కేసు విచారణ అనంతరం రాజమండ్రి ట్రయల్ కోర్టు ఆనందకుమార్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. నిందితుడి తరఫు న్యాయవాదులు ఈ తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో సమర్పించిన సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.
తదనంతరం దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించి శిక్ష తగ్గింపు లేదా ముందస్తు విడుదల కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. తాను ఇప్పటికే చాలా కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్నానని, మానవతా దృక్పథంతో తన విజ్ఞప్తిని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. అయితే నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ వాదనలను అంగీకరించలేదు.
ధర్మాసనం తన తీర్పులో, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అత్యంత ఘోర నేరాల విషయంలో కోర్టులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వ్యక్తి గత నేర చరిత్రను కారణంగా చూపుతూ ముగ్గురు అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనను సాధారణ నేరంగా చూడలేమని కోర్టు భావించినట్లు తెలుస్తోంది.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తీర్పు తీవ్రమైన హత్య కేసుల్లో శిక్ష తగ్గింపుపై సుప్రీంకోర్టు అనుసరిస్తున్న కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా బహుళ హత్యలు, ముందస్తు ప్రణాళికతో జరిగిన నేరాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ఘటనల విషయంలో కోర్టులు నేరస్థులకు ఉపశమనం కల్పించడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని వారు చెబుతున్నారు.





