ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు

Must read

“సంక్షోభ సమయంలోనూ అవకాశాలను సృష్టించగలగడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు నేను రష్యాలో పర్యటిస్తున్నాను” అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేస్​ పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా ఐదో రోజు మాస్కోలో ఆయన ప్రవాస భారతీయులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు, పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా రష్యాలోని పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో లోకేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూ పరిశ్రమల ప్రతినిధులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు.

మాస్కోలోని ఎంబాసీ ఆఫ్​ ఇండియా, మస్కాలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశం భావోద్వేగ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్, విదేశాల్లో స్థిరపడి విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న భారతీయుల కృషిని ప్రశంసించారు. “మీరు భౌగోళికంగా భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ, మీ హృదయాల్లో భారతీయతను సజీవంగా ఉంచుకున్నారు. మీరు సాధిస్తున్న విజయాలు ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతున్నాయి” అని అన్నారు.

“మీరు భారతదేశాన్ని విడిచి వచ్చినా, భారతదేశం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. మాతృభూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న ప్రతి ప్రవాస భారతీయుడు దేశానికి గర్వకారణం” అని లోకేష్ పేర్కొన్నారు. భారతీయ డయాస్పోరా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అనధికార రాయబారులుగా వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సహకారం కీలకమని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణల రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. విదేశాల్లోని నైపుణ్యం, అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రవాస భారతీయులను కోరారు.

రష్యా పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన సంస్థలతో జరిగిన సమావేశాల్లో సాంకేతిక భాగస్వామ్యం, పరిశ్రమల స్థాపన, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో సహకార అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుందని లోకేష్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కొత్త పరిశ్రమలు స్థాపించి, లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ భాగస్వామ్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!