నాకన్నా రెండేండ్లే చిన్న
ఐతేనేం రాఖీ కడతాననేమో? నాకు రక్షణ కవచమయ్యాడు!
ఎంతైనా దేశరక్షణా కంకణం కట్టుకున్నాడు కదా!
సరిహద్దుల్లో తమ్ముడు
మారుమూల పల్లెలో నేను!
ఐతేనేం గోడ కవతలే ఉన్న భావన!
మనో బలానికీ- బలగానికీ వాడు కట్టనేలేదు
గోడెన్నడూ!
నా కంటినిండా నీరు నిండి, ఇన్లాండ్ లెటర్ లోని ఆకుపచ్చ సిరా అక్షరాలనీ అలుక్కుపోయినా…
ఎలా అర్థమైందో నా ప్రేమ? ఆకళింపు చేసుకొని, ఆకాశమార్గాన మబ్బురంగు చీర పంపాడు!
ఆ మబ్బుతోనే నేనూ మడతకాజా పంపాను!
ఏమడత పేచీలేకుండా మనసు పెట్టి మతలబులన్నీ రాసాడు!
పహల్గాం ఘటనకు ఆపరేషన్ సింధూర్ విధులకు వెడుతున్నానని…
మళ్ళీ రాఖీకి తప్పక వస్తానని!
మబ్బులవంక చూడడమే సరిపోయింది! సాలంతా…
ఆపరేషన్ సింధూర్ కు వెళ్లి – వస్తానన్న వాడు రానేలేదు!
పహల్గాం పడతుల సింధూరం రాల్చిన వాడి అంతు తేల్చి, నా వంటి చెల్లెండ్ల రక్షణ కవచమయ్యాడు!
మరో వారం గడిచాక మడతపడని యూనిఫాం;
చెదరిపోని చేతి రాఖీతో జెండాలో చుట్టి ఆకాశ శకటంలో ( వాయుసేన) నాకు మాటిచ్చిన తమ్ముడొచ్చాడు!
కానీ నేనే మడతకాజా తినిపించలేక- మతిచెడిపోయింది!
వసుధైక కుటుంబంలో నేనొక్కదాన్నే చెల్లెలినా?
నా తోడ బుట్టిన వాడికి కోటాను కోట్ల చెల్లెండ్ల రక్షా కవచమయ్యాడు…
ఒక కంట కన్నీరు- మరోకంట ఆనంద భాష్పాలేరులై పారుతుంటే…
జై జవాన్! జై హిందంటూ!
రాఖీ చేతికి ముద్దుపెట్టాను!
మంచుకు బిగుసుకు పోయిన చేయి- నా చుట్టూ రక్షా బంధమై నిలిచింది!
మరణంలోనూ.. మాట నిలుపుకొన్న వారెందరుంటారు?
భారతీయ సోదరులు తప్ప!
రంగరాజు పద్మజ





