నిండు నూరేళ్ళ జీవితాన్ని బంగారం చేసుకో
నిత్యం వదలక దేహాన్ని సింగారం చేసుకో
శ్రేయోభిలాషుల సేవలను మనసారా గౌరవించు
పని ప్రావీణ్యుల గుర్తించి సత్కారం చేసుకో
చెలియ చెంతనున్న వేళలో చింతలను మరిచిపో
చల్లని పున్నమి వెన్నెలలో విహారం చేసుకో
సర్వదా తోడుగా నిలిచే వారిని ఆదరించు
కలిసొచ్చే స్నేహితులతో సహకారం చేసుకో
ఇబ్బందులు కలిగిస్తే విచారం వ్యక్తపరచు
చేసిన తప్పులు దిద్దుకొని సంస్కారం చేసుకో
పచ్చని పుడమి ప్రకృతిని కనులారా తిలకించు
అందాల పూలతోటలో సంచారం చేసుకో
సాయం చేసిన మనసులను ఎప్పటికినీ మరువకు
అపకారులకు సహితం కోరి ఉపకారం చేసుకో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.





