గత 11 ఏళ్ల పాలనలో బిజెపి బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదని, ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ బీసీలకు చేసిన మేలు ఏమీ లేదని, పైగా దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీ కులగణన చేపడతామని చెప్పి, తీరా ఇప్పుడు కులగనన చేయకుండా మోసం చేస్తున్నారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు
ఈ సందర్భంగా ప్రధానికి అందించిన పది ప్రశ్నలను జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాకు విడుదల చేశారు
ప్రధానికి బీసీల 10 ప్రశ్నలు…
1) జాతీయ జన గణనలో సమగ్ర కుల గణన చేపడుతామని ఏప్రిల్ ఒకటి 2025వ తేదీన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏమైంది ?
2) ఏప్రిల్ ఒకటి 2026వ రోజు నుండి దేశవ్యాప్తంగా చేపడుతున్న మొదటి దశ కుటుంబాల లెక్కింపులో ఓబీసీ కుటుంబాలను ఎందుకు లెక్కించడం లేదు ?
3) మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోట ఎందుకు కల్పించడం లేదు ?
4) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ఏకగ్రీవ ఆమోదంతో చేసిన చట్టాన్ని గత సంవత్సరం కాలంగా ఆమోదించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ?
5) దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎందుకు ఎత్తివేయడం లేదు ?
6) మీ 11 సంవత్సరాల పరిపాలనలో దేశంలోని 80 కోట్ల మంది బీసీల సంక్షేమానికి ఎందుకు ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదు ?
7) 54 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో జనాభాలో 60 శాతం ఉన్న ఓబీసీల సంక్షేమానికి రెండు వేల 400 కోట్ల నిధులు కేటాయిస్తే బీసీలు అభివృద్ధి చెందడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది ?
8) దేశంలో ఎస్సీ, ఎస్టీ లకు జనాభా దామాషా రిజర్వేషన్ ఉన్నది, చివరికి అగ్రవర్ణాలకు కూడా 10% ఈ డబ్ల్యూ ఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించిన మీరు ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదు ?
9) పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదు ?
10) మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా గత 11 సంవత్సరాలుగా ఎందుకు తొక్కి పెడుతున్నరు ?
ఈ ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ జవాబు చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని లేదంటే పదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీలు చేపడుతామని, హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రo కోసం శ్రీకాంత్ చారి బలిదానం చేసుకొని చరిత్రలో నిలిచిపోయారని, తాను కూడా బీసీ కుల గణన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి 75 వయసులో ఆరోగ్యం బాగా లేకున్నా ఆమర నిరాదీక్ష చేపడుతున్నానని వి హనుమంతరావు వెల్లడించారు
బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ ఓబీసీలను లెక్కించకపోవడం అంటే దేశంలో ఓబీసీల అస్తిత్వాన్ని కనుమరుగు చేయడమేనని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఓబీసీ కులగణన సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రత చేయాలన్నారు.
సిపిఐ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కేంద్రం బీసీల పట్ల పూర్తిగా వివక్షత ప్రదర్శిస్తుందని, బీసీల పేరు చెప్పుకుని పబ్బం గడిపే ప్రధాని బీసీలకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన ఆరోపించారు. ఈ నెల 10న తెలంగాణ రాష్ట్ర పర్యటన విచ్చేస్తున్న నరేంద్ర మోడీకి బీసీల సెగను వినిపించడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని, వామపక్షాల తరఫున ఈ ప్రజాస్వామ్య ఆందోళనలో తాము పాలుపంచుకుంటామని ఆయన తెలిపారు
ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ కో కన్వీనర్ ఉప్పరి శేఖర్ సగర, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, టీజేఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జస్వంత్ కుమార్, డెమొక్రటిక్ ఫ్రంట్ చైర్మన్ కోల జనార్దన్ గౌడ్, బూడిద మల్లికార్జున్ యాదవ్, పానుగంటి విజయ్ గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, ఉదయ్ నేత, విజయలక్ష్మి, ఆంజనేయులు సాగర్ తదితరులు పాల్గొన్నారు…





