ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్లు

Must read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025’ అవార్డు సాధించడం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ అవార్డు సాధించిన సందర్భంగా గురువారం నిర్వహించిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ముఖ్య కార్యదర్శి (సీఎస్), వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు సీఎం‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అభినందనలు తెలిపారు.

సీఎం సభలోకి ప్రవేశించగానే అధికారులు, కలెక్టర్లు నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పాలనా సంస్కరణలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని పలువురు అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ అవార్డు తన వ్యక్తిగత కృషి ఫలితం కాదని, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి కృషికి దక్కిన గౌరవమన్నారు. “మంత్రులు, సీఎస్ నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు అందరూ కష్టపడి పనిచేయడం వల్లే ఈ అవార్డు వచ్చింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం టీమ్ ఏపీకి దక్కిన గౌరవం” అని సీఎం పేర్కొన్నారు.

రెండేళ్ల క్రితం రాష్ట్ర పరిస్థితులపై దేశవ్యాప్తంగా వచ్చిన విమర్శలను గుర్తు చేసిన చంద్రబాబు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గురించి దేశం మొత్తం సానుకూలంగా మాట్లాడుతోందని చెప్పారు. “రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? అన్నదానికి ఈ అవార్డు ఒక ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.

గతంలో ఇలాంటి అవార్డులు స్వీకరించడంపై తాను పెద్దగా ఆసక్తి చూపేవాడిని కాదని సీఎం చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకురావాలంటే ఇలాంటి అవార్డులు అవసరమన్నారు.

“ఇప్పుడు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత ఎక్కువ గుర్తింపు వస్తే అంత ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులు, వ్యవసాయం, సేవారంగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు.

“ఈ అవార్డు కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు. ఇది మన ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనం” అని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల పురోగతి, పరిపాలనా సంస్కరణలపై సమీక్ష జరిగినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ల పనితీరుపై కూడా సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

మన రాష్ర్టానికి ఎన్ని అవార్డులు వస్తే… మన రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుంది… మరిన్ని పెట్టుబడులు వస్తాయి. అందుకే మరిన్ని అవార్డులను మనం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితం చేస్తున్నాను.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!