APAIMS 2.0తో పారదర్శకంగా ఎరువుల పంపిణీ.. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

Must read

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో, పారదర్శకంగా సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశపెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది జూన్ 8 నుంచి కృష్ణా, కాకినాడ జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ విధానం ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ జరుగుతోందని వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,97,733 మంది రైతులకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ విజయవంతంగా పంపిణీ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా ఎరువుల పంపిణీ

రైతు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం అవసరమైన పరిమాణంలోనే ఎరువులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దీనివల్ల సమతుల్య ఎరువుల వినియోగం పెరిగి దిగుబడులు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ కూడా సక్రమంగా వినియోగమవుతుందని పేర్కొన్నారు.

అక్రమాలకు చెక్

APAIMS 2.0 అమలుతో ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, మళ్లింపులు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాలు పూర్తిగా అరికట్టే అవకాశం లభించిందని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై రియల్‌టైమ్ పర్యవేక్షణ జరుగుతోందని, iFMS, APAIMS, భౌతిక నిల్వల సమన్వయంతో ఖచ్చితమైన నిల్వల నిర్వహణ జరుగుతోందని వివరించారు.

ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి రైతుకు సమాన అవకాశాలు కల్పించేలా వ్యవస్థ రూపొందించామని తెలిపారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీకి సంబంధించిన సమస్యలు ఉంటే 155251 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులు తమ ఎరువుల కొనుగోలు చరిత్ర, అర్హత వివరాలను కూడా సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించామని చెప్పారు.

సాంకేతిక సమస్యలు అధిగమించాం

వ్యవస్థ ప్రారంభ దశలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా వాటిలో ఎక్కువ భాగం ఇప్పటికే పరిష్కరించామని మంత్రి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు OTP లేదా సర్వర్ సమస్యలు తలెత్తుతున్నప్పటికీ ప్రత్యేక సాంకేతిక బృందాలు 24 గంటలు పర్యవేక్షిస్తూ వెంటనే పరిష్కరిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం APAIMS 2.0 పూర్తిస్థాయిలో సజావుగా పనిచేస్తోందని వెల్లడించారు.

తప్పుడు ప్రచారాలపై మంత్రి ఆగ్రహం

గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే APAIMS 2.0 తీసుకొచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పారదర్శక విధానం వల్ల అక్రమాలకు అవకాశం లేకపోవడంతో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నిరాధార ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను ధృవీకరించకుండా రైతులను తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. అధికారిక గణాంకాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా మాత్రమే వార్తలు ప్రచురించాలని సూచించారు. పారదర్శక పాలన ద్వారా నిజమైన రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

టమాటా ధరలపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

రాష్ట్రంలో టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారిక గణాంకాల ప్రకారం ధరలు స్థిరంగానే ఉన్నాయని చెప్పారు.

ములకలచెరువు మార్కెట్‌లో జూన్ 25న 10 కిలోల టమాటా కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.210, మోడల్ ధర రూ.180 నమోదైందన్నారు. అలాగే గుర్రంకొండ సబ్ మార్కెట్ యార్డులో కనిష్ఠ ధర రూ.112, గరిష్ఠ ధర రూ.192, మోడల్ ధర రూ.152 నమోదైందని వివరించారు. అసత్య ప్రచారం వల్ల రైతుల్లో అనవసర ఆందోళన నెలకొంటుందని హెచ్చరించారు.

జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్‌పై స్పష్టత

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్‌కు సంబంధించి వస్తున్న ప్రచారాలపై కూడా మంత్రి స్పందించారు. రెండు యూనిట్లలో ఒకటి నిరంతరం పనిచేస్తుండగా, మరో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను రెండు రోజుల్లోనే పరిష్కరించి కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు తెలిపారు.

ప్రస్తుతం మామిడి పండ్ల అన్‌లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రైతులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, నిరాధార ప్రచారాలను నమ్మవద్దని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!