పెళ్ళాం (గజల్)

Must read

చక్కని తోడై చల్లని నీడై పక్కన నిలిచేది పెళ్ళాం
ఎండైనా వానైనా ఎప్పుడూ వీడకుండేది పెళ్ళాం॥

అలసిన వేళల్లో అమృతమాటల జల్లులు కురిపించి,
ఆప్యాయ మమతలతో మనసును మురిపించేది పెళ్ళాం॥

కష్టపు కెరటాలు ఎదురొచ్చిన ప్రతివేళలో,
ధైర్యపు దివ్వెయై దారిని చూపించేది పెళ్ళాం॥

ఇంటి గడపను స్వర్గసీమగా మలచి అనునిత్యం,
నవ్వుల పూలతో నందనవనముగా మార్చేది పెళ్ళాం॥

తన సుఖమంతా త్యాగమనే కొవ్వొత్తిలా కరిగించి,
కుటుంబ సంక్షేమానికి దీపమై వెలిగేది పెళ్ళాం॥

బాధల బరువును భుజాలపై మౌనంగా మోస్తూనే,
బలమై ప్రతి అడుగున భర్తను నడిపించేది పెళ్ళాం॥

కన్నీటి చుక్కను కంటిలో కారనీయకుండానే,
చిరునవ్వులు పూయించి గుండెలను గెలిచేది పెళ్ళాం॥

ముందుచూపుతో పిల్లల భవితకు పునాదులను వేసి,
మంచి సంస్కారాల మకుటమై నిలిచేది పెళ్ళాం॥

సిరులకన్న మిన్నైన స్నేహమనే శుభసంపదగా,
జీవిత యాత్రలో దైవవరమై దొరికేది పెళ్ళాం॥

సగమని దేవుడు సృష్టించిన సత్యరూపమై,
సుఖదుఃఖాలలో సమభాగమై నిలిచేది పెళ్ళాం॥

తాళికట్టిన తనరాజు ప్రేమను హృదయంలో దాచుకొని,
జన్మజన్మల బంధమై చివరివరకు నిలిచేది పెళ్ళాం॥

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!