రేవంత్ రెడ్డికి నామినేషన్ పత్రం నింపడం రాదు :బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

Must read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతరుల సహాయం లేనిదే సొంతంగా ఎన్నికల నామినేషన్ పత్రాన్ని కూడా పూర్తి చేసే అర్హత, జ్ఞానం లేవని, అలాంటి వ్యక్తి నేడు రాష్ట్రాన్ని ఏలుతూ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల చదువులను, నైపుణ్యాలను అవమానించడం అత్యంత శోచనీయమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో వ్యక్తి సహాయం తీసుకోకుండా రేవంత్ రెడ్డి ఒక నామినేషన్ ఫారాన్ని పూరించగలరా అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సొంతంగా చదువు లేని ముఖ్యమంత్రి తన వద్దే విద్యాశాఖను ఉంచుకోవడం విడ్డూరంగా ఉందని, తక్షణమే ఆ విభాగాన్ని డి శ్రీధర్ బాబు లాంటి ఉన్నత విద్యావంతుడైన మంత్రికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో పదిహేనేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగానైతే అబద్ధపు మాటలతో కాలాన్ని వెళ్లదీశారో, నేడు రేవంత్ రెడ్డి కూడా అదే రీతిలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రోజుకో ప్రకటన చేస్తూ రాష్ట్రాన్ని చీకట్లోకి నెడుతున్నారని, సీఎం ఇచ్చే స్టేట్‌మెంట్లు చూస్తుంటే తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంతో కష్టపడి 65 శాతం తరగతులకు హాజరై, పరీక్షలు రాసి పట్టాలు పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు కనీసం ఒక అప్లికేషన్ ఫారం కూడా నింపడం రాదంటూ ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నాణ్యమైన ఇంజనీర్లను తయారు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, అలాంటిది మన విద్యార్థుల సామర్థ్యంపై స్వయంగా ముఖ్యమంత్రే అనుమానాలు వ్యక్తం చేస్తే వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఏ సంస్థ ముందుకు వస్తుందని ప్రశ్నించారు. ఈ రకమైన దిగజారుడు వ్యాఖ్యల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విద్యార్థులను, విద్యా వ్యవస్థను అవమానిస్తూ మాట్లాడుతుంటే, అక్కడే ఉన్న ఉపాధ్యాయులు దానికి మద్దతుగా చప్పట్లు కొట్టడం దారుణమని అర్వింద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలకు సరైన టాయిలెట్ సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, బాగు చేయకపోగా, కేవలం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడానికే కొత్తగా స్కూల్ భవనాలు నిర్మిస్తామని గొప్పలు చెబుతున్నారని ఆరోపించారు. టీచర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు చెల్లించలేని సీఎం, ఉపాధ్యాయుల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిలాగే విమర్శలు చేయడం మానలేదని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణ ప్రతినిధులు ఎక్కడికైనా వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వారు వచ్చినట్లు చూసేవారని సీఎం మాట్లాడటం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రిని చూసి ఏ పారిశ్రామికవేత్త అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని పాలించడానికి ఉన్నారా లేక కాలక్షేపం చేస్తూ తమాషాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. చదువుకున్న వారికీ, చదువుకోని వారికీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసిందని ఎంపీ అర్వింద్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా కూల్చివేతలు, నిర్ణయాలపై కోర్టులు తీవ్ర స్థాయిలో చీవాట్లు పెడుతున్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ వ్యవస్థను, అధికారులను వెనుకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక చర్యలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

మరోవైపు, ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పక్కనబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, తన కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టే పనిలో నిమగ్నమయ్యారని ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో సొంత వర్గానికి లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!