అమరావతికి చట్టబద్ధత.. రైతుల త్యాగం ఫలించింది: సోమిరెడ్డి

Must read

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిను చట్టబద్ధం చేస్తూ లోక్‌సభ ఆమోదం తెలపడం సంతోషకర పరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే విధంగా అమరావతి నిర్మాణం జరుగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అద్భుత రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సీఎం తన బ్రాండ్‌ను మరోసారి నిరూపించుకుంటారని అన్నారు.అమరావతి నిర్మాణం కోసం సుమారు 34 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల త్యాగాన్ని రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని సోమిరెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారిగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అంగీకరించి రైతులు చూపిన సహకారం అభినందనీయం అని తెలిపారు.అమరావతికి చట్టబద్ధత లభించడం వల్ల భూముల విలువ పెరగడంతో పాటు పెట్టుబడులు కూడా ఆకర్షితమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగం మరింత చురుకుదనం సంతరించుకుంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. “మూడు ముక్కలాట”తో రాష్ట్రాన్ని అయోమయానికి గురిచేశారని ఎద్దేవా చేశారు.“సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్న వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. రాజధాని అంశంపై వైసీపీకి స్పష్టత లేదని, బయట ఒకలా, సభలో మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.రాష్ట్రానికి రాజధాని అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని, దీనిపై ఏ రాజకీయ పార్టీ అయినా స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందేనని అన్నారు. గతంలో రాజధాని లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.

అమరావతిలో ఇప్పటికే పలు జాతీయ సంస్థలు స్థాపించబడుతున్నాయని, హైరైజ్ టవర్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే విధంగా అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!