ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ సాక్షిగా తెలుగు ప్రజల కల సాకారం అవుతోందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతోందని, తెలుగు ప్రజల ఏళ్ల నాటి ఆశయాలు నెరవేరబోతున్నాయని మంత్రి అన్నారు. అమరావతి రాజధానిగా అధికారిక గుర్తింపు పొందే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.
భారత పార్లమెంట్ వేదికగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో అమరావతి రాజధానికి అధికారిక ఆమోదం లభించబోతుందని మంత్రి వెల్లడించారు. ఇది తెలుగు ప్రజల దశాబ్దాల ఆశ, ఆకాంక్షల ఫలితమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై కూడా మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాజధాని అంశంలో స్పష్టత లేకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆరోపించారు. “మూడు రాజధానుల విధానం పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేసి, రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టారు” అని విమర్శించారు.
అదేవిధంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, పలు రంగాల్లో అవ్యవస్థ నెలకొన్నదని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చి అభివృద్ధి దిశగా నడిపిస్తోందని పేర్కొన్నారు.అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణం పూర్తయితే రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.





