రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళాల ప్రారంభం

Must read

రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం’ కార్యక్రమమం ద్వారా మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు , పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా అధికారికంగా ప్రారంభించారు.”.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఎంపిక చేసిన ఏడు సన్న వరి రకాలకు ప్రోత్సాహకంగా బోనస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి విత్తనాలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా ఈ మేళాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతు వేదికల్లో నిర్వహించే ఈ విత్తన మేళాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాల విక్రయంతో పాటు వాటి సాగు పద్ధతులు, పంట యాజమాన్యం, అధిక దిగుబడుల సాధనకు సంబంధించిన సాంకేతిక సూచనలను కూడా అందించనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు ప్రత్యక్షంగా మార్గనిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాల కోసం 1,24,649 క్వింటాళ్ల వరి విత్తనాలు, 6,913 క్వింటాళ్ల పప్పుధాన్యాల విత్తనాలు, 11,815 క్వింటాళ్ల నూనెగింజల విత్తనాలు, 1,339 క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు సిద్ధం చేశారు. అదనంగా నానో యూరియా, నానో డి.ఏ.పీ. ఎరువులను కూడా రైతుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ “నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి , తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించబడు కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంతో పాటు శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!