ఈ చట్టంతో బీసీలకు రక్షణ :మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు

Must read

బీసీ రక్షణ చట్టంతో వెనుబడిన వర్గాలు గౌరవ ప్రదంగా సామాజిక జీవనం కొనసాగించేలా రక్షణ కల్పిస్తున్నామని, కులం, వృత్తుల పేరుతో దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం రూపొందిస్తున్నామని మంత్రులు ఎస్.సవిత, అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ చట్టంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలో జిల్లా స్థాయిలోనూ బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. బీసీ ముసాయిదా రక్షణ చట్టం జాతీయ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని, అక్కడ అనుమతి రాగానే అసెంబ్లీలో ఆమోదానికి ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా బీసీ రక్షణ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడలోని ఓ హోటల్ లో బీసీ ముసాయిదా రక్షణ చట్టంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బుధవారం కీలక సమావేశం జరిగింది.

సమావేశ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ముందుగా మంత్రి సవిత సవిత మాట్లాడుతూ, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బీసీ రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. బీసీలను వేధించినా, జాతి, కుల వృత్తుల పేరుతో దూషించినా బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హులున్నారు. బీసీ రక్షణ చట్టం కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందజేసిన సలహాలు సూచనలను ఇప్పటికే రూపొందించిన బీసీ ముసాయిదా రక్షణ చట్టం బిల్లులో పొందుపరుస్తామన్నారు. త్వరలో జిల్లాల్లోనూ బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు.

తుది నివేదికను త్వరలో జాతీయ బీసీ కమిషన్ కు అందజేస్తామన్నారు. బీసీ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, అసెంబ్లీలో ఆమోదానికి బీసీ రక్షణ చట్టాన్ని సభలో ప్రవేశపెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ సైతం బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీలు సమాజానికి బ్యాక్ బోన్లు అని వ్యక్తులు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అని మంత్రి సవిత తెలిపారు.

బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారన్నారు. వారు కుల వివక్షకు గురికాకుండా ఉండాలని భావించి బీసీ రక్షణ చట్టానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. దేశంలో ఎన్నో చట్టాలున్నా బీసీల రక్షణకు చట్టం లేదన్నారు. 2014-19 మధ్య జగన పాలనలో బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో బీసీలు తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆనాడే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.

ఇచ్చిన మాటకు కట్టుబడుతూ బీసీ రక్షణచట్టాన్ని తీసుకొస్తున్నామన్నారు. రెండేళ్ల నుంచి బీసీ రక్షణ చట్టం గురించి చర్చిస్తూ వస్తున్నామన్నారు. శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లు ఆమోదించే ముందే కేంద్ర జాతీయ బీసీ కమిషన్ సలహాలు కూడా తీసుకుంటామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. ఆ రిజర్వేషన్లను 27 శాతానికి సీఎం చంద్రబాబునాయుడు పెంచారన్నారు. ప్రభుత్వం మారాక గత ప్రభుత్వం లో బలహీన వర్గాలపై కక్ష కట్టి రిజర్వేషన్లు తగ్గించారని మండిపడ్డారు. న్యాయస్థానాలు చెప్పాయని బీసీ రిజర్వేషన్లను తగ్గించేశారని, కాని, పైకోర్టుకు వెళ్లి గత ప్రభుత్వం న్యాయపోరాటం చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే, రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ వేశామన్నారు.బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేలా కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

అంతకుముందు మంత్రి సవిత నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. బీసీ రక్షణ చట్టం పటిష్టంగా ఉండేలా రూపొందించాలని సూచించారు. బీసీలను వృత్తులపరంగా, కులాల పరంగా దూషించుకుండా ఉండేలా చట్టం అమలు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేవంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్, ప్రభుత్వ విప్ లు కాల్వ శ్రీనివాసులు, బొమ్మిడి నాయకర్, పలువురు ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, గల్లా మాధవి, కాగితపు కృష్ణప్రసాద్, పితాని సత్యనారాయణ, గౌతు శిరీషా, చదలవాడ అరవింద బాబు, కూన రవికుమార్, కందికుంట వెంకటప్రసాద్, బొగ్గు రమణమూర్తి, గోండు శంకర్, మామిడి గోవిందరావు సహా ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, గాదె శ్రీనివాసులు నాయుడు, బీద రవిచంద్రయాదవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున రావు, పలువురు న్యాయనిపుణులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ లో మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనిత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొని పలు సలహాలు సూచనలు అందజేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!