కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు తో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం సీఆర్డీయే కార్యాలయంలో రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ రంగాల్లో అమలవుతున్న పథకాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఎండీ అరుణ్ కుమార్, టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, చైర్మన్ పట్టాభిరామ్‌తో పాటు హడ్కో, మెప్మా, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రంలో పురపాలక, గృహ నిర్మాణ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రస్తుత స్థితి, మెప్మా ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి నెలా నిర్వహిస్తున్న “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
అలాగే కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల పురోగతి, నిధుల వినియోగం, పెండింగ్ పనులు, భవిష్యత్ అవసరాలపై కూడా చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు. నగరాల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు.
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర సహకారం మరింత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పట్టణాభివృద్ధి రంగంలో మరిన్ని ప్రాజెక్టులు వేగవంతం అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి రూపొందించిన విజన్‌ను అభినందించారు. ఆధునిక సౌకర్యాలు, సమగ్ర ప్రణాళికతో అమరావతి దేశంలోనే ఆదర్శవంతమైన రాజధానిగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలకు సేవలందిస్తున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి స్పష్టం చేశారు.





