ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందించిన “రైజింగ్ తెలంగాణ 2045” లక్ష్యాల్లో వ్యవసాయ రంగానికి కీలక స్థానం ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు రైతులను శాస్త్రీయంగా సన్నద్ధం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడం ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ క్రమంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ICRISAT సంయుక్త ఆధ్వర్యంలో యువ రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా పరిధిలోని పటాన్చెరులో ఉన్న ఇక్రిశాట్ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క రైతును ఎంపిక చేసి “సాయిల్ హెల్త్ వాలంటీర్”గా తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ రెండు రోజుల శిక్షణలో భూసార పరీక్షలు, పంటల ఎంపిక, పంటల సరళి మార్పులు, వాతావరణ మార్పుల ప్రభావం, అంతర్ పంటల సాగు, సేంద్రీయ వ్యవసాయం వంటి కీలక అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. రైతులు తమ భూముల స్థితిగతులను అర్థం చేసుకుని, తగిన పంటలను ఎంచుకోవడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతుల ప్రధాన ఆస్తి భూమి అని, భూమి ఆరోగ్యంగా ఉంటేనే రైతుల ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. భూమి సారవంతతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, ఇందులో సాయిల్ హెల్త్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి గుణాత్మకత దెబ్బతింటోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించేందుకు రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని, బయో ఫెర్టిలైజర్లు, సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. అంతర్ పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడమే కాకుండా, నేల నాణ్యతను మెరుగుపరచవచ్చని మంత్రి తెలిపారు.
అలాగే వ్యవసాయంలో యాంత్రిక పద్ధతులు, అగ్రిటెక్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా లాభదాయక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. శాస్త్రీయ పరిజ్ఞానం గ్రామీణ స్థాయికి చేరేలా వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా రైతుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంతో పాటు, భవిష్యత్ వ్యవసాయానికి దృఢమైన పునాది వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ 2045 లక్ష్యాల సాధనలో వ్యవసాయం కీలక భూమిక పోషించనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రొఫెషర్ జయశంకర్ తెలంగాణ రాష్ర్ట అగ్రికల్చర్ యునివర్స్ సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానయ్య, కొండ లక్ష్మన్ తెలంగాణ స్టేట్ హర్టీకల్చర్ యునివర్ సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, తదితరులు పాల్గొన్నారు. అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.





