తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను అందించాలనే సంకల్పంతో కొత్తగా మంజూరైన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల క్యూఆర్ కోడ్ ఆధారిత లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరవేయడంలో రేషన్ కార్డు అత్యంత ప్రామాణికంగా నిలుస్తుందని, ప్రభుత్వ పాలనలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు.
ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి పంపిణీ ప్రారంభోత్సవం జరగనుంది. అదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభా నియోజకవర్గాల్లో ఏకకాలంలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్డుల అందజేత ప్రక్రియ సాగుతుందని మంత్రి వివరించారు. లబ్ధిదారులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాబితాల ప్రచురణ, కార్డుల ముద్రణ, రవాణా మరియు పంపిణీ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవ అధికారిక వేడుకలు పూర్తయిన అనంతరం, ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఆయా నియోజకవర్గాలలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఈ పంపిణీ సరళంగా జరిగేలా చూస్తారు. ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డు అనేది ప్రభుత్వ అధికారిక అడ్రస్ ప్రూఫ్‌గా, ఆరోగ్శ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వంటి సకల సంక్షేమ పథకాలకు ప్రాథమిక అర్హత పత్రంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు తమ దరఖాస్తు ప్రక్రియ ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఈపీడీఎస్ వెబ్సైట్లో ప్రత్యేక సదుపాయం కల్పించింది. దరఖాస్తుదారులు వెబ్సైట్లోకి వెళ్లి తమ రేషన్ కార్డ్ నంబర్ లేదా FSC రిఫరెన్స్ నంబర్, జిల్లా వివరాలను నమోదు చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా తమ దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో క్షణాల్లో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త పింఛన్ల పంపిణీపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
దీర్ఘకాలిక రక్తసంబంధిత వ్యాధులైన తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ ఆసరా పరిధిలోకి తెచ్చి పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల అర్హతలను వేగంగా నిర్ధారించి, కొత్త పింఛన్ల పంపిణీని కూడా ఇదే ఆగస్టు 15వ తేదీ నుంచే అధికారికంగా ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు.వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లు గీత కార్మికులందరికీ పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా పింఛన్లు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా, దివ్యాంగ పింఛన్‌దారులు మరణించిన సందర్భంలో, వారి భార్యలకు తక్షణమే పింఛన్ వర్తించేలా నిబంధనలను సవరించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, దరఖాస్తు చేసుకున్న వెంటనే పింఛన్ మంజూరు అయ్యేలా సాంకేతిక మార్పులు చేయాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగాన్ని మరింత క్రియాశీలకం చేసేందుకు పరిపాలనా సంస్కరణలు అమలు చేస్తున్నారు. మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
స్థానిక సంస్థల ప్రతినిధులను పాలనలో భాగస్వాములను చేసేందుకు ప్రతి 45 రోజులకు ఒకసారి విధిగా మండల పరిషత్ సాధారణ సమావేశాలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశాలకు సంబంధిత నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను గౌరవప్రదంగా ఆహ్వానించి, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాలని ఆదేశించారు. ఈ నూతన సంక్షేమ నిర్ణయాలు తెలంగాణలోని పేద వర్గాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.





