హరీశ్‌రావు క్షుద్ర పూజలపై స్పందించాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Must read

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రోజున హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందిన ఆలయాలను ఎందుకు సందర్శించారో, అక్కడ ఎలాంటి పూజలు నిర్వహించారో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచడానికి ఈ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం ఆయన సందర్శించిన ప్రదేశాల వెనుక ఉన్న ప్రాధాన్యతను బట్టే ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు.

హరీశ్‌రావుపై తాను ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేయలేదని, నిందలు వేయలేదని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన నుంచి లీగల్ నోటీసులు వస్తే వాటికి భయపడే ప్రసక్తే లేదని, ఏ అంశమైనా న్యాయస్థానంలోనే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. ఆయా ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం ఆయనకు ఎందుకు వచ్చిందో బయటపెట్టాలన్నారు. రాష్ట్రానికి ఎవరు శని, ఎవరు దరిద్రమో గత శాసనసభ ఎన్నికల తీర్పు ద్వారా ప్రజలు ఇప్పటికే స్పష్టంగా తేల్చేశారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మూఢనమ్మకాలు లేవని, పార్టీ త్యాగాల చరిత్రను ప్రతిపక్షాలు తెలుసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, తనకు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను మహేశ్ కుమార్ గౌడ్ పూర్తిగా ఖండించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై చర్చించుకుంటామని వెల్లడించారు. నిన్న కూడా సిఎంతో తాజా పరిణామాలపై మాట్లాడినట్లు తెలిపారు. సమన్వయ కమిటీలో ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉండదని, ముఖ్యమంత్రి స్థానానికి తాము ఇచ్చే గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ, యాజమాన్యం వేర్వేరు కాదని తేల్చిచెప్పారు.

తనకు సంబంధించి కొన్ని ఆడియోలు, వీడియోలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాలపై టీపీసీసీ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు చేసే నాయకులకు దమ్ముంటే ఆ ఆడియోలు, వీడియోలను వెంటనే బహిరంగంగా బయటపెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో దొంగచాటుగా ఫిర్యాదులు చేసుకునే అలవాటు ఎవరికీ లేదని, ఏ అభిప్రాయమైనా ముఖాముఖి ప్రత్యక్షంగానే మాట్లాడుకుంటామని చెప్పారు.

ప్రభుత్వం, పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో కీలకమైన ప్రజా సమస్యలపై లోతుగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.ప్రతిపక్ష బీజేపీ నాయకుల వైఖరిపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడే మాటలన్నీ నీటి మూటలని, ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభవంలో ఎంపీలు అరవింద్, బండి సంజయ్ ఇద్దరూ తన ముందు చిన్నపిల్లలతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు నిరంతరం తప్పుడు ఆరోపణలకు దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!