వనరులన్నీ సమానంగా అందితేనే సామాజిక న్యాయం: కల్వకుంట్ల కవిత పిలుపు

Must read

సమాజంలో ఉన్న ప్రాథమిక వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా అందాలనేదే ప్రతి ఒక్కరి ఆలోచన కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అనగానే అది కేవలం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా సాగే పోరాటంగా భావిస్తుంటారని, అయితే వనరులను అందరూ సమానంగా పంచుకోవాలనడమే నిజమైన సామాజిక న్యాయమని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో అగ్రవర్ణ మిత్రులు ఒక్కసారి పునరాలోచించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సమాజంలోని ఆర్థిక అసమానతలను ప్రశ్నిస్తూ కవిత ఒక స్పష్టమైన ఉదాహరణ చెప్పారు. వంద మంది ప్రజలకు వంద రొట్టెలు ఉన్నప్పుడు తలా ఒక రొట్టె తింటే అది న్యాయం, ధర్మం అవుతుందని అన్నారు. కానీ పది మంది బలవంతులు ఏకంగా 90 రొట్టెలు తింటూ, మిగిలిన 90 మంది బలహీనులు కేవలం 10 రొట్టెలు మాత్రమే తింటుంటే ఇది ఏ రకంగా న్యాయమో సమాజం ఆలోచించాలని ప్రశ్నించారు. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఎప్పుడు ఏ పెద్ద సామాజిక పరివర్తన వచ్చినా అగ్రవర్ణాల్లోని ప్రజాస్వామ్యవాదులు కలిసివచ్చి ఆ మార్పులను ముందుకు తీసుకెళ్లారని ఆమె గుర్తుచేశారు.

గౌతమ బుద్ధుడు, ఛత్రపతి సాహూ మహారాజ్ వంటి గొప్ప వ్యక్తుల ఆదర్శాలతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయని కవిత చెప్పారు. “దున్నేవాడిదే భూమి” అనే నినాదంతో గతంలో దొరల గడీలను ఎదురించి ఆర్థిక అసమానతలను తొలగించే దిశగా తొలి అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. అయితే సామాజికంగా, కుల వివక్షపై జరగాల్సిన పోరాటాలు మాత్రం ఆశించిన స్థాయిలో వేగంగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కుల వివక్ష, సామాజిక అన్యాయం జరుగుతున్నాయని, ఈ అసమానతలను తుడిచిపెట్టి అందరికీ న్యాయం చేసేందుకు తమ సంస్థ సంకల్పిస్తోందని తెలిపారు.

సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హతపై వస్తున్న విమర్శలకు కూడా కవిత ఘాటుగా సమాధానమిచ్చారు. తాను ఒక నిర్దిష్ట వర్గంలో జన్మించడం తన చేతుల్లో లేని అంశమని, అయితే ఏ లక్ష్యం కోసం జీవించాలి, ఎవరి సంక్షేమం కోసం పనిచేయాలో నిర్ణయించుకోవడం మాత్రం తన చేతుల్లోనే ఉందన్నారు. కనీసం వార్డు మెంబర్ స్థానానికి కూడా పోటీ చేయలేకపోతున్న చిన్న కులాల వారి తరఫున నిలబడి, వారికి రాజకీయ సాధికారత లభించే వరకు తన జీవితాన్ని అణగారిన వర్గాల కోసం అంకితం చేస్తానని ప్రకటించారు.

విదేశాల్లో మన దేశస్థులపై వివక్ష చూపితే రేసిజం అని ఖండిస్తున్నామని, మరి మన పక్కనే ఉండే కుల వివక్షను తుడిచిపెట్టడానికి ఎందుకు చొరవ తీసుకోకూడదని ప్రశ్నించారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడే ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు కూడా పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించి ఉంటే, ఇవాళ భారత్ అభివృద్ధిలో అమెరికా వంటి అగ్రదేశాలతో పోటీపడేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ శాసనసభలో 42 శాతం బిల్లును తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ బిల్లును రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో పెట్టి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి పరస్పరం ప్రేమలేఖలు రాసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఈ ప్రతిష్టాత్మక సభ ద్వారా కవిత పలు కీలకమైన రాజకీయ, సామాజిక తీర్మానాలను ఆమోదించారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులకు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఇవ్వాలని, అలాగే తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌కు ‘పద్మవిభూషణ్’ బహుకరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సభలో తీర్మానం చేశారు.

ఈ సమావేశంలో వివిధ బిసి, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, సామాజిక విశ్లేషకులు, కవులు, కళాకారులు మరియు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు పాల్గొన్నారు. సామాజిక సమత సాధించే వరకు తమ పోరాటం ఆగేది లేదని, ప్రతి అణగారిన వర్గానికి హక్కులు దక్కేలా ఊరూరా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!