మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని రోజులు శక్తి ఉంటే అన్ని రోజులు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యోగుల సంక్షేమ కోసం నిరంతరం పాటుపడతానని స్పష్టం చేశారు. అంబేద్కర్ సూచించిన విధంగా కేవలం చదువు ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు.
అందులో భాగంగానే లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో అంబేద్కర్ నాలెడ్జి సెంటర్ అలాగే నింబోలి అడ్డ లో ఒక లైబ్రరీ , హాస్టల్ ను ఏర్పాటుకు బడ్జెట్ లో ముఖ్యమంత్రి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మహనీయులు చూపిన మార్గంలో ఉద్యోగస్తులందరూ నడవాలని తద్వారా ఆయా వర్గాలకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను క్షేత్రస్థాయిలో అందేలా ఉద్యోగస్తులదే ఈ పాత్ర కాబట్టి అందుకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
మనందరం ఒక గొప్ప సందర్భంలో కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తునన్నారు. ఈ ఏప్రిల్ మాసం భారత దేశ చరిత్రలో ఒక విశిష్టమైన నెల అని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ నెలలోనే మహనీయులు అయిన బాబు జగ్జీవన్ రామ్, డా.బి ఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే లాంటి గొప్ప మహానుభావులు జన్మించారనీ తెలిపారు.
వీరు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు – ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక సమానత్వ దార్శనికత అని తెలిపారు. ఈ దేశానికి వారు చేసిన సేవలు అపారమైనవి. సామాజిక న్యాయం, సమాన హక్కులు, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను మనకు అందించారనీ తెలిపారు.
ఈ సచివాలయంలో పని చేస్తున్న మన 320 మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తులు కూడా వారి ఆలోచనలను ఆచరణలో పెట్టే బాధ్యతను మోస్తున్నారు. మనం కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు ప్రజలకు సేవ చేసే ప్రతినిధులు అని వ్యాఖ్యానించారు. మహనీయులు సూచించిన మార్గంలో మనం ముందుకు సాగాలన్నారు.





