తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల కరవు భత్యం (డీఏ)ను 2.1 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు.
ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 50.7 శాతం నుంచి 52.8 శాతానికి పెరిగింది. ఈ పెంపు వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38 వేల మందికి పైగా ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సిబ్బంది స్వాగతిస్తున్నారు.
ఈ డీఏ పెంపు 2026 జనవరి నెల నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రకటించింది. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న మూడు నెలల బకాయిలను రాబోయే నెలల్లో ప్రత్యేక సప్లిమెంటరీ బిల్లుల ద్వారా విడతలవారీగా చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ప్రతి నెలా అదనంగా సుమారు రూ.2.82 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల కృషి, సేవలను ప్రభుత్వం గుర్తిస్తోందని ఆయన తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర రవాణా వ్యవస్థకు వెన్నెముకలా పనిచేస్తున్నారని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. డీఏ పెంపుతో ఉద్యోగుల ఆర్థిక భారం కొంత తగ్గుతుందన్నట్టు ప్రభుత్వం భావిస్తోందని మంత్రి పొన్నం తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ఆర్టీసీ సుమారు రూ.954 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తుండటంతో సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.. ఇదే సమయంలో కొత్త బస్సులను కొనుగోలు చేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా లాభాలను మరింత పెంచుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు వివరించింది.





