దేశవ్యాప్తంగా వర్షాకాలంపై ఆసక్తి నెలకొన్న వేళ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమయ్యే మాన్సూన్ ఈసారి కొద్దిగా ముందుగానే రానుందని సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, అలాగే సాధారణ ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌లో రుతుపవనాల రాకపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఎల్‌నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఈసారి పరిస్థితులు కొంత భిన్నంగా ఉండవచ్చని చెబుతున్నారు.
ఈ అంశంపై భారత వాతావరణ శాఖ (IMD) మాజీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ స్పందించారు. ఆయన వివరాల ప్రకారం, ఈసారి దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే కొంత తక్కువగా ఉండే సూచనలు ఉన్నప్పటికీ, అది ముఖ్యంగా ఉత్తర భారతదేశంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో మాత్రం వర్షాలు బాగానే కురిసే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వర్షపాతం ఆశాజనకంగా ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఇది రైతులకు కీలకమైనది వరి, పత్తి, పప్పుధాన్యాలు వంటి పంటల సాగుకు సమయానికి వర్షాలు రావడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ముందస్తుగా మాన్సూన్ రాక వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూలంగా మారనుంది.
రుతుపవనాలపై ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) ప్రభావం కూడా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఈ వ్యవస్థ పాజిటివ్ దిశగా మారితే, ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఐవోడీ పాజిటివ్‌గా మారితే భారతదేశంలో వర్షపాతం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, నీటి నిల్వలు మెరుగుపడడం వంటి అంశాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలవు. అలాగే విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరా వంటి రంగాలకూ మాన్సూన్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఉత్తర భారతదేశంలో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అక్కడి రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నీటి నిర్వహణ, సాగు విధానాల్లో మార్పులు చేపట్టడం ద్వారా ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.





