రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అధికారంలోకి వస్తుందని, ఎంపీ స్థానాలతో పాటు మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ మేయర్ పీఠాలను దక్కించుకోవడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని నాటకాలు ఆడినా, చివరికి ప్రజలు బీజేపీ వైపే నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు.
ఓటు చోరీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని, ఈ దేశంలో మొదటి ఓటు చోరీకి పాల్పడింది ఆ పార్టీయేనని ఆయన మండిపడ్డారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారికి కేవలం రెండు ఓట్లు వచ్చినప్పటికీ ప్రధానమంత్రిని చేశారని, నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ది అక్రమాల చరిత్రేనని విమర్శించారు. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, రాజకీయ నాయకులను జైలుకు పంపి, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్.. ఈరోజు రాజ్యాంగం, ఓటు చోరీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ను ఎవరూ చీల్చలేదని, వారి అంతర్గత కుమ్ములాటల వల్లే ఆ పార్టీ ముక్కలయిందని, కేవలం ఒకే ఒక్క కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తూ అంతరించిపోయే దశకు చేరుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ “పార్టీ చోర్, రాజ్యాంగ చోర్, ఓటు చోర్” గా మారిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రాంచందర్ రావు ఆక్షేపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, ప్రభుత్వ అధికారులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బి.ఎల్.ఓ (BLO)లు అందుబాటులో ఉన్నారని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ద్వారా కేవలం చనిపోయిన వారివి, ఇతర ప్రాంతాలకు మారిపోయిన వారి దొంగ ఓట్లు మాత్రమే తొలగించబడతాయని, నిజమైన ఓటర్లకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ అనేది కొత్తది కాదని, పౌరుల హక్కుల రక్షణ కోసం ఓటర్ల జాబితా సవరణ అత్యంత ఆవశ్యకమని, ఎందుకంటే ప్రస్తుత జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వంటి విదేశీయుల ఓట్లు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉండాలా, వద్దా అనే అంశంపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశం మనదని, ఇక్కడి పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు.
గతంలో బెంగాల్లో సైతం ఇలాగే ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు, అక్కడి ప్రజలు బీజేపీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని రాంచందర్ రావు గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలలో హిందువుల ఇళ్లలో ముస్లింల ఓట్లు అక్రమంగా నమోదయ్యాయని, వారు ఎవరో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో వేలాది దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయనే పూర్తి వివరాలతో ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశామని, దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము గెలిస్తే ఈవీఎంలు (EVMs) బాగున్నాయని, ఓడిపోతే ఈవీఎంలు తప్పు అని మాట్లాడటం ఈ రెండు పార్టీల ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే విధంగా ఆలోచిస్తూ.. ఓటర్ల జాబితా సవరణకు, మహిళా రిజర్వేషన్లకు, పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు రాంచందర్ రావు. రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో సైతం ఈ రెండు పార్టీలు లోపాయికారీగా కలిసి పనిచేస్తూ ఎంఐఎం (MIM) పార్టీకి సహకరించేందుకు వ్యూహాలు పన్నుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, బీజేపీని అడ్డుకోవడం, ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా కుట్రలు చేస్తున్నాయని, వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.





