హిందూ ధర్మం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక గొప్ప జీవన విధానమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి చాటి చెప్పింది. మతపరమైన విశ్వాసాలు, ఆచారాల పరిధిని నిర్ణయించే క్రమంలో బుధవారం తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి హిందువుగా తన విశ్వాసాన్ని చాటుకోవడానికి తప్పనిసరిగా దేవాలయాలను సందర్శించాల్సిన పనిలేదని, లేదా కఠినమైన ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం, కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయ ప్రవేశం మతపరమైన వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరుపుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తి తన ఇంట్లో లేదా ఒక చిన్న గుడిసెలో దీపాన్ని వెలిగించుకున్నా, అది అతని అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, అంతకంటే మించిన నిరూపణలు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
శబరిమల ఆలయంలోకి నిర్ణీత వయస్సు గల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో వెలువడిన చారిత్రాత్మక తీర్పుపై దాఖలైన పునస్సమీక్ష పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ విచారణలో భాగంగా బుధవారం జరిగిన 15వ రోజు వాదనలలో పలు ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వచ్చాయి. మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన ఒక పక్షం తరఫున సీనియర్ న్యాయవాది డాక్టర్ జి. మోహన్ గోపాల్ తన వాదనలను వినిపించారు.
1966లో కోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఆయన ఉదహరిస్తూ, వేదాలను అత్యున్నత ప్రమాణంగా అంగీకరించేవాడే హిందువు అని నిర్వచించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే గతంలో ఇటువంటి నిర్ణయాలకు రావడం సరైంది కాదని ఆయన వాదించారు. నేడు హిందువులుగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరూ వేదాలనే పరమ ప్రమాణంగా భావిస్తున్నారా? అనే ప్రశ్నను ఆయన ధర్మాసనం ముందుంచారు. సామాజిక న్యాయం కోసం హిందూ మతంలోని అంతర్గత వర్గాల నుంచే డిమాండ్లు వస్తున్నాయని ఆయన సభకు విన్నవించారు.
న్యాయవాది మోహన్ గోపాల్ వాదనలపై ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న సానుకూలంగా స్పందించారు. అందుకే హిందూ మతాన్ని కేవలం ఒక మతంగా కాకుండా, విశాలమైన ‘జీవన విధానంస అని పిలుస్తారని ఆమె పేర్కొన్నారు. ఒక హిందువుగా కొనసాగడానికి గుడికి వెళ్లడం లేదా నిర్దిష్ట ఆచారబద్ధమైన పద్ధతులను అనుసరించడం కచ్చితమైన నిబంధన ఏమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రజలు తమ అంతరాత్మలో కలిగి ఉండే విశ్వాసాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, దానికి ఎవరూ అడ్డుపడలేరని ఆమె తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ, మత విశ్వాసానికి భౌతికమైన నిరూపణలు అక్కర్లేదని, ఒక సామాన్యుడు తన గుడిసెలో వెలిగించుకునే చిన్న దీపం కూడా ఆ మతం పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని చాటుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు హిందూ ధర్మం యొక్క ఉదారతను మరియు వ్యక్తిగత విశ్వాసానికి ఉన్న స్వేచ్ఛను ప్రతిబింబిస్తున్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు.





