విశ్వాస పరీక్ష నెగ్గిన విజయ్

Must read

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామానికి తెరలేపుతూ టీవీకే అధినేత విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం శాసనసభలో బలపరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌, బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో స్పష్టమైన మెజార్టీ సాధించి తన ప్రభుత్వ స్థిరత్వాన్ని చాటిచెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ఉత్కంఠకు గురిచేసిన ఈ బలపరీక్షలో విజయ్‌ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవగా, 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే మాత్రం ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్‌ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

తమిళనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి విజయ్‌ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్‌ ఆధ్వర్యంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో సభలో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చివరికి సభాపతి ఓటింగ్‌ నిర్వహించగా, సాధారణంగా జరిగే వాయిస్‌ ఓటింగ్‌కు భిన్నంగా ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ వారి అభిప్రాయాలను నమోదు చేశారు. దీంతో బలపరీక్ష ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారింది.

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌ వంటి మిత్రపక్షాలు బహిరంగ మద్దతు ప్రకటించాయి. అంతేకాకుండా అన్నాడీఎంకేలోని రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కు అనుకూలంగా ఓటేయడం రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

చర్చ సందర్భంగా అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను విజయ్‌ ప్రలోభాలకు గురిచేశారని ఆయన మండిపడ్డారు. బలపరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్‌ భేటీ కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అన్నాడీఎంకే పార్టీ ఐక్యంగానే ఉందని, తమ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే పళనిస్వామి వ్యాఖ్యలకు అదే పార్టీ రెబల్‌ వర్గం నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. రెబల్‌ ఎమ్మెల్యేల నేత వేలుమణి మాట్లాడుతూ తాము ప్రజల ప్రయోజనాల కోసమే విజయ్‌కు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి స్థిరమైన ప్రభుత్వం అవసరమని, అందుకే సీఎం విజయ్‌కు అండగా నిలిచామని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకేలోని విభేదాలు మరింత స్పష్టమయ్యాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!