రైతుల దీక్షకు సంఘీభావం పేరిట పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం సరికాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీదర్ బాబు అన్నారు. బీఆర్ఎస్) నేతలు ఈ విధానాన్ని అవలంబించడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన నిప్పులు చెరిగారు.
వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న భూసేకరణ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే ‘రాజకీయ యాత్రలు’ నిర్వహిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
వికరాబాద్ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. గతంలో పదేళ్లపాటు (టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్) పాలనలో ఈ ప్రాంతం తీవ్రంగా వెనుకబాటుకు గురైందని ఆయన విమర్శించారు. ఇప్పుడు వికరాబాద్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, దాన్ని ఓర్వలేకే బీఆర్ఎస్, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.ఔ
తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో భూసేకరణ వంటి కీలక ప్రక్రియలు అవసరమవుతాయని, వాటిని అడ్డుకోవడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన సూచించారు.
రాజకీయ లాభాల కోసం రైతుల సమస్యలను ఉపయోగించుకోవడం తగదని మంత్రి హితవు పలికారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు నిజానిజాలు గ్రహించి అపోహలకు లోనుకాకూడదని విన్నవించారు.
ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను అడ్డుకునే రాజకీయాలు రాష్ట్రానికి మేలు చేయవని స్పష్టం చేశారు.





