దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల నెపంతో చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 మేర పెంచేశాయి.
పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులపై పెను భారం పడనుంది. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ‘ద్రవ్యోల్బణ వీరుడు’ (ఇన్‌ఫ్లేషన్ మ్యాన్) అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రూ. 1,518 మేర ధర పెరగడం మోదీ మార్క్ వసూళ్లకు నిదర్శనమని విమర్శించింది.
కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం నెలనెలా గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఏడాది జనవరిలో రూ. 111, ఫిబ్రవరిలో రూ. 50, మార్చిలో రెండు విడతలుగా కలిపి రూ. 146, ఏప్రిల్‌లో రూ. 218 పెంచిన ప్రభుత్వం.. తాజాగా మే 1న ఏకంగా రూ. 993 పెంచిందని గణాంకాలతో సహా పోస్ట్ చేసింది.
కేవలం 120 రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ. 1,518 పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాదిలో ఇంకా 8 నెలలు మిగిలి ఉన్నాయని, మోదీ ‘ధరల బాదుడు’ మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది.
ఏప్రిల్ 29న పోలింగ్ ముగిసిన వెంటనే ఈ పెంపు నిర్ణయం వెలువడటంపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వక చర్యేనని ఆయన మండిపడ్డారు. ఓట్లు పడే వరకు ధరలను నియంత్రించి, పోలింగ్ అవ్వగానే ప్రజలపై భారం మోపడం బీజేపీ నైజమని విమర్శించారు.
ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడు టీ తాగాలన్నా, హోటల్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. పద్ధతి ప్రకారం ధరలను పెంచుతూ చిన్న వ్యాపారాలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ ధరల పెంపుపై తనదైన శైలిలో స్పందించారు. గ్యాస్ సిలిండర్ ఖరీదు కావడం అంటే సామాన్యుడి పళ్లెంలోని రొట్టె ఖరీదు కావడమేనని ఆయన అన్నారు. “బీజేపీ ప్రభుత్వం ధరలను ఒకేసారి రూ. 1000 పెంచాల్సింది, ఆ ఏడు రూపాయల తగ్గింపు ఎవరి కోసం?” అంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై బీజేపీ ఎప్పుడు చర్చ చేపడుతుందని ఆయన ప్రశ్నించారు. దొంగిలించి తినే వారికి లేదా ఇతరుల ఇళ్లలో తినే వారికి సామాన్యుడి కష్టాలు తెలియవని ఘాటు వ్యాఖ్యలు చేశారు.





