ప్రతిబింబాల పర్వం

Must read

మోములు మనసులకు ప్రతిబింబాలు—
మాటల వెనుక దాగిన మౌన గాథల ప్రతిధ్వనులు;
కన్నులలో మెరిసే కాంతులు
కలల గర్భంలో మొలిచిన భావాల దర్పణాలు॥

చేతలు మనుషులకు ప్రతిబింబాలు—
చేయి చాచి చేరిన చల్లని స్నేహం,
చెయ్యి ఎత్తి చూపే కాఠిన్యం
చిత్తాలు చాటే సూటి ముద్రలు॥

ప్రకృతి దృశ్యాలు అందానికి ప్రతిబింబాలు—
పొద్దున్న పొగమంచులో పరిమళించే పరవశం,
సాయంత్రపు సంధ్యలో సజీవంగా జారే రంగులు—
సృష్టి చిత్రకారుడి చిరునవ్వుల చాయలు॥

నవ్వులు ఆనందానికి ప్రతిబింబాలు—
నిశ్శబ్దాన్నీ నాట్యం చేయించే నినాదాలు,
చిరునవ్వుల వెదజల్లులు—
చీకట్లలో వెలిగే దీప్తుల దీపాలు॥

భావాలు ఆలోచనలకు ప్రతిబింబాలు—
గుండె గర్భంలో గుసగుసలాడే గీతాలు,
ఆలోచనల ఆకాశంలో ఎగిరే పక్షులు—
అవే మానవ అస్తిత్వానికి ఆత్మసాక్ష్యాలు॥

కవితలు కవులకు ప్రతిబింబాలు—
అక్షరాల్లో అల్లుకున్న ఆత్మనాదాలు,
పదాల్లో పరిమళించే ప్రాణపు పలుకులు—
కవి హృదయం కరిగి కాగితంపై పడిన చుక్కలు॥

సముద్రంలో సూర్యుని ప్రతిబింబం
సరస్సులో జాబిలి ప్రతిబింబం
మనసుల్లో మనుజుని ప్రతిబింబం
విశ్వంలో సృష్టికర్త ప్రతిబింబం॥

ప్రతిబింబాలే ప్రపంచానికి సాక్ష్యం—
ప్రతి క్షణం ఒక అద్దం, ప్రతి అనుభవం ఒక చిత్రం;
మనసు చూపే దారిలో పయనం
మనమే మనకు కనిపించే మహాకావ్యం॥

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!