నడినెత్తి పైత్యము
ఆధిపత్యమే అనర్థము
వికృత మనుష పరిహాసము
ప్రకృతికే మరణభాష్యం
ధరణి కల్లోలము
ఏ ధరికి ఈ ప్రయాణము?
లేని హద్దులు భువిని గీసి
నాది నాదనే వంతలు వేసి
పంతమున పేల్చిరి క్షిపణి
రాలిన శిథిలాల కింద
మూగగా రోదిస్తోంది అవని
ఏ ధరికి ఈ ప్రయాణము?
యుద్ధ కాంక్షకు రాచరికమా?
రాచబుద్ధి ప్రజామోద్యమమా?
సైనికుల బలిదానాలే
గత చరిత్ర చేదు ఆనవాళ్లు.
రాతికోట దాటి లోచన
సామాన్యులకై సాగె పాలన
గుణపాఠం నేర్చుకున్నారు
ప్రజాస్వామ్యం నేర్పుకున్నారు.
మూసిన దారిపై చూస్తున్నారు
ఆ దారి మొత్తం పాపపంకిలం
వ్యక్తికేంద్ర పాలన
వ్యక్తి ఆరాధన
ప్రపంచ యుద్ధాల ప్రేరణ.
అతి జాతి భావన
పరజాతుల విద్వేషం
కుయుక్తులు, పన్నాగాలు
అధునాతన ఆయుధాలు.
ఒక్కడి పిలుపు కొరకు
లక్షల కుత్తుకలు పోటీ పడి
తెగిపడి భక్తి చాటుకున్నయి .
నేలంత రక్తముతో
కోట్ల సైన్యం, సామాన్య జనం
తెగి రాలిన ప్రాణాలు
ఆనాటి నేలంతా
వారి రక్తంతో చల్లబడింది.
ప్రకృతి–మానవ విపత్తులకు
సామాన్యులే సమిధలు.
ఏ చరిత్ర గుణపాఠం
ఎంతవరకు నేర్చిరి?
ప్రగతి లేని మార్గమునే
మరల మరల తలచిరి.
అయినా సరే ఒకే ప్రశ్న
భయానక ప్రయాణం
ఏ ధరికి?
రచన : లక్ష్మి నారాయణ అంపెల్లి. (అకిరా )





