ఆరోగ్యంగా ఉండేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేని సులభమైన వ్యాయామాల్లో వాకింగ్ ఒకటి. ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేకుండా.. ఎక్కడైనా, ఎప్పుడైనా నడకను రోజువారీ జీవనశైలిలో భాగంగా చేసుకోవచ్చు. రోజూ సుమారు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే వాకింగ్ ప్రారంభించాలనుకునే చాలామందికి ఒక సాధారణ సందేహం ఉంటుంది. ఉదయం నడవడం మంచిదా? లేక సాయంత్రం వాకింగ్ చేయడం మంచిదా? అనే ప్రశ్న తరచుగా ఎదురవుతుంది. దీనికి అందరికీ వర్తించే ఒకే ఒక్క సమాధానం లేదని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేసే సమయం వ్యక్తిగత లక్ష్యం, జీవనశైలి, పని వేళలు, నిద్ర అలవాట్లు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.
ముఖ్యంగా వాకింగ్‌ను ఏ సమయంలో చేస్తున్నామన్నదానికంటే.. దాన్ని క్రమం తప్పకుండా చేయడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మన రోజువారీ షెడ్యూల్‌కు అనుగుణంగా ఏ సమయంలో నడకను కొనసాగించగలమో ఆ సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. అయితే ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
ఉదయం వాకింగ్‌తో రోజంతా ఉత్సాహం
ఉదయం వాకింగ్ చేయడం వల్ల రోజును చురుగ్గా ప్రారంభించే అవకాశం ఉంటుంది. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కొంత సమయం నడవడం ద్వారా శరీరం, మనసు యాక్టివ్‌గా మారుతాయి. ఉదయం నడక సమయంలో సహజ సూర్యకాంతి శరీరానికి అందుతుంది. ఇది శరీరంలోని జీవ గడియారం లేదా సర్కేడియన్ రిథమ్‌ను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.
ఉదయం సహజ కాంతికి కొంతసేపు గురికావడం వల్ల రాత్రి నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని నిద్ర-మేల్కొనే చక్రం క్రమబద్ధంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. ఉదయం సూర్యకాంతి ద్వారా శరీరానికి విటమిన్-డీ లభించే అవకాశం కూడా ఉంటుంది. అయితే సూర్యరశ్మి తీవ్రత, చర్మ రకం, కాలానుగుణ పరిస్థితులు వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి.
ఉదయం నడక మానసిక స్థితిపైనా సానుకూల ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ కారణంగా ఎండార్ఫిన్లు వంటి రసాయనాలు విడుదల కావడంతో మానసిక ఉల్లాసం పెరగవచ్చు. ఉదయం వాకింగ్ చేసిన తర్వాత రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండేందుకు ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ప్రతిరోజూ వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలనుకునేవారికి ఉదయం వాకింగ్ అనుకూలంగా ఉంటుంది. రోజువారీ పనులు, ఉద్యోగ బాధ్యతలు ప్రారంభమయ్యేలోపే వాకింగ్‌ను పూర్తి చేయడం ద్వారా తర్వాత సమయం దొరకలేదనే కారణంతో వ్యాయామాన్ని వాయిదా వేయకుండా ఉండవచ్చు.
సాయంత్రం వాకింగ్‌తో ఒత్తిడికి చెక్
సాయంత్రం వాకింగ్ చేయడం కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. రోజంతా శరీరం కదలికలో ఉండటం వల్ల కండరాలు, కీళ్లు ఉదయం కంటే కొంత సడలిన స్థితిలో ఉంటాయి. దీంతో కొంతమందికి వేగంగా నడవడం లేదా ఎక్కువసేపు వాకింగ్ చేయడం సులభంగా అనిపించవచ్చు.
ఉద్యోగం, వ్యాపారం లేదా రోజువారీ పనుల ఒత్తిడితో అలసిపోయిన వారికి సాయంత్రపు నడక మంచి రిలాక్సేషన్‌గా పనిచేస్తుంది. పని ముగిసిన తర్వాత కొంతసేపు బయట ప్రశాంతంగా నడవడం వల్ల మనసు తేలికపడే అవకాశం ఉంటుంది. రోజంతా ఎదురైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇది సహాయపడుతుంది.
ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు వంటి స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. ఇలాంటి వారికి సాయంత్రపు వాకింగ్ శారీరక కదలికతో పాటు మానసిక విశ్రాంతిని అందిస్తుంది. ఎక్కువసేపు కూర్చుని ఉండే అలవాటును తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఎవరు ఏ సమయాన్ని ఎంచుకోవాలి?
వాకింగ్‌కు ఉదయం లేదా సాయంత్రం అనే నిర్దిష్టమైన ‘బెస్ట్ టైమ్’ అందరికీ ఒకేలా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం త్వరగా నిద్రలేచి వ్యాయామం చేయడం సౌకర్యంగా అనిపిస్తే ఆ సమయాన్ని ఎంచుకోవచ్చు. అదే సమయంలో ఉద్యోగం లేదా ఇతర బాధ్యతల కారణంగా ఉదయం సమయం కుదరకపోతే సాయంత్రం వాకింగ్ చేయవచ్చు.
వాకింగ్‌ను ఎంచుకునేటప్పుడు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాయామం ప్రారంభించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎక్కువ తీవ్రతతో వ్యాయామం చేయాలనుకునేవారు తమ ఆరోగ్య స్థితికి అనుగుణంగా నడక వేగం, వ్యవధిని నిర్ణయించుకోవాలి.
సమయం కంటే క్రమం తప్పకుండా నడవడం ముఖ్యం
వాకింగ్ విషయంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం క్రమబద్ధత. ఒకరోజు ఉదయం నడిచి.. మరోరోజు పూర్తిగా మానేయడం కంటే ప్రతిరోజూ మనకు అనుకూలమైన సమయంలో నడవడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. రోజువారీ జీవనశైలిలో భాగంగా వాకింగ్‌ను కొనసాగించడం ద్వారా శారీరక చురుకుదనం పెంచుకోవచ్చు.
వాకింగ్ ప్రారంభించే ముందు కొద్దిసేపు నెమ్మదిగా నడిచి శరీరాన్ని సిద్ధం చేసుకోవడం, అనంతరం వేగాన్ని క్రమంగా పెంచడం మంచిది. నడక పూర్తయిన తర్వాత కూడా వేగాన్ని ఒక్కసారిగా తగ్గించకుండా కొంతసేపు నెమ్మదిగా నడవడం ద్వారా శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
ఉదయం, సాయంత్రం వాకింగ్ రెండింటికీ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం నడక సహజ కాంతి, రోజువారీ చురుకుదనం, వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవడం వంటి అంశాల్లో ఉపయోగపడొచ్చు. సాయంత్రం వాకింగ్ రోజంతా పేరుకున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి, కండరాలు సడలిన తర్వాత మరింత సౌకర్యంగా నడవడానికి సహాయపడొచ్చు. కాబట్టి మీ జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత సౌకర్యానికి సరిపోయే సమయాన్ని ఎంచుకుని.. వాకింగ్‌ను క్రమం తప్పకుండా కొనసాగించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.





