రాత మార్చుకున్న మానాల గ్రామ ప్రజలు
ప్రభుత్వ బడిని కాపాడేందుకు ఏకగ్రీవ తీర్మానం
గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులకు నో ఎంట్రీ
ప్రభుత్వ పాఠశాలలోనే చిన్నారులందరి చేరిక
ఎవరో వస్తారని ఏదో చేస్తారని కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు.. మన సమస్యని మనమే తీర్చుకోవాలి అని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. అప్పుడప్పు సినిమాల్లో పాటల్లో కూడా ఇలాంటి లైన్లు వినిపిస్తుంటాయి. ఓసే రాములమ్మా సినిమాలో ఆడపిల్లకు ధైర్యం చెబుతూ..ఈమాటలు ఉంటాయి. ఇప్పుడూ ఇదంతా దేనికీ అంటారా.. ఇదిగో అక్కడికే వస్తున్నాను.. ఒకప్పుడూ పంతులు గారంటే ప్రభుత్వాలకే కాదు.. ప్రజలకు కూడా కాస్తో కూస్తో మర్యాద ఉండేది. కానీ ప్రైవేటు పాఠశాలల పుణ్యమా అని ఆ మర్యాద కాస్తా మట్టి కొట్టుకు పోయింది. అంతే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గి భక్తులు లేని గుళ్లుగా పాఠశాలలు మారుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు కూడా డీలా పడిపోయారు. ప్రభుత్వాలను నిలదీయలేక.. ప్రజలను ఒప్పించలేక సతమతమవుతూ బతుకుతున్నారు.
ఇదిగో ఇలాంటి సమయంలోనే కనుమరుగవుతున్న ప్రభుత్వ విద్యను ప్రజల హక్కును గుర్తు చేస్తూ తమ గ్రామాన్ని తామే మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు . ప్రైవేటు బడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు అంటూ కదం కలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామ ప్రజలు. విద్యార్థుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడటంతో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు ఏకమయ్యారు.గ్రామంలోని చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామసభలో నిర్ణయించారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఎస్సైకు, అలాగే సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో ఈ గ్రామ నిర్ణయం పత్రికల్లో ఓ వెలుగులా వెలిగింది.
ఒకప్పుడూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యలు నేర్చుకున్న వారు. పూటగడవలేని స్థితిలో ఉన్నవాళ్లైనా సరే అప్పొసొప్పో చేసి.. పిల్లలకు మంచి చదువులు చదివించాలని అది ప్రైవేటు సంస్థల్లోనే లభిస్తుందన్న అపోహతో పరుగులు పెడుతున్న తరుణంలో ఈ గ్రామ నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తిరిగి విద్యార్థులతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో మానాల గ్రామస్తులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను వారు చేసి చూపించారు. ఇలాంటి గ్రామాలను ఆదర్శంగా చేసుకుని మసకబారుతున్న ప్రభుత్వ విద్యను వృద్ది చెందెలా.. రాష్ర్ట ప్రజలు, ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరుకుందాం..
అమీనా కలందర్
కవిరత్న, సీనియర్ జర్నలిస్ట్





