గత కొంత కాలంలో నగరంలో వరుసగా హత్యలు.. దోపిడీలు కలకలం రేపుతున్నాయి. పనిమనుషులుగా చేరి, అదను చూసుకుని నిజస్వరూపాలను బయటపెడుతున్నారు. నగరంలోని
అత్యంత సంపన్న ప్రాంతాలుగా పేరుగాంచిన జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ ప్రాంతాల్లో వరుస నేర ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంటి పనిమనుషులుగా చేరి యజమానుల విశ్వాసాన్ని సంపాదించిన అనంతరం భారీ దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్న ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడు నెలల్లో వరుసగా చోటుచేసుకున్న మూడు ప్రధానంగా
జరిగిన మూడు ఘటనలు నగరంలోని ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తున్నాయి. నేపాల్ కు చెందిన ఓ ముఠా ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించినప్పటికీ వీరి ఆగడాలు ఆగడం లేదు.
సంపన్నుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ముందుగా పనివారిగా చేరడం, కొన్ని వారాల పాటు నమ్మకంగా పనిచేయడం, తర్వాత సరైన సమయం చూసుకుని దోపిడీలు చేయడం ఈ ముఠా ప్రత్యేకతగా గుర్తించారు.
ఫిబ్రవరి 6న నందగిరి హిల్స్‌లో జరిగిన ఘటన మొదటిసారిగా సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో పనివాడిగా చేరిన భూపిందర్ షా అనే యువకుడు, ఇంట్లోని ఇతర పనివారికి మత్తుమందు ఇచ్చి దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. ఘటన బయటపడే సరికి నిందితుడు నగరాన్ని వీడి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
మార్చి 14న జూబ్లీహిల్స్‌లో మరో భారీ దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు యజమానులు ఇంట్లో లేని సమయంలో లాకర్లు పగలగొట్టి రూ. 3 కోట్ల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కూడా నిందితులు ముందుగానే ఇంటి పరిస్థితులను పూర్తిగా గమనించి, సరైన సమయం చూసుకుని దోపిడీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మే 8న చోటుచేసుకున్న ఘటన నగరాన్ని షాక్‌కు గురిచేసింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేస్తున్న ఓ యువతి యజమాని భార్యను హత్య చేసి నగదు, నగలతో పరారైంది. ఈ ఘటనతో నగరంలోని సంపన్న ప్రాంతాల్లో భయం మరింత పెరిగింది. దీనిని మరువక ముందే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో ఓ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.30,000 నగదు దోచుకెళ్లారు. ఇంట్లో పని చేసేవారే పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రొఫెసర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ 13 రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన దంపతులను పనిలో పెట్టుకున్నారు. సోమవారం రాత్రి పనిమనిషి పుట్టినరోజు అని చెప్పి, కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వారి స్నేహితులుగా మరో ఐదుగురిని ఇంటికి పిలిచారు. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడి చేసి, తాళ్లతో కట్టేశారు. “మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి” అని బాధితులు వేడుకున్నా వినకుండా, వారికి మత్తుమందు ఇచ్చి ఓ గదిలో బంధించారు. ఈ ఘటనలకై పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ముఠాలు అత్యంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందుగా ధనవంతుల ఇళ్లను గుర్తించి, మధ్యవర్తుల ద్వారా పనివారిగా చేరుతున్నట్లు సమాచారం.
పోలీసులు ఏం చెబుతున్నారు?
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నందగిరి హిల్స్ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇంటి పనివారిపై పూర్తి వివరాలు సేకరించాలని, పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా పనివారిని నియమించుకునే ముందు వారి ఆధార్, చిరునామా, పూర్వ ఉద్యోగ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలతో, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామంటున్నారు.
ప్రస్తుతం నగరంలో పనిమనుషులపై నమ్మకం లేకుండా పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో నేపాల్ ముఠా అంతం అయ్యేకే మనస్సాంతి లభిస్తుందని కొందరు వాపోతున్నారు.
కవిరత్న అమీనా కలందర్





